మల్లన్న ఉత్సవాలకు ఆహ్వానం
రేవంత్ రెడ్డిని కోరిన మంత్రి కొండా సురేఖ
హైదరాబాద్ – ఐనవోలులో కొలువు తీరిన శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలకు రావాల్సిందిగా రాష్ట్ర దేవాదాయ , ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ఆహ్వానించారు. ఈ సందర్బంగా రేవంత్ రెడ్డిని శాలువాతో సన్మానించారు. శ్రీ మల్లికార్జున స్వామి వారి చిత్రపటాన్ని బహూకరించారు. అనంతరం ఆలయ పూజారులు, వేద పండితులు ప్రసాదాన్ని అందజేసి రేవంత్ రెడ్డికి ఆశీర్వచనాలు అందజేశారు.
ప్రతి ఏటా ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఇప్పటికే దేవాదాయ శాఖ మంత్రి ఏర్పాట్లను పరిశీలించారు. పెద్ద ఎత్తున చేయాలని ఆదేశించారు. శాఖా పరంగా సహాయ సహకారాలు అందజేస్తామని చెప్పారు.
సుదూర ప్రాంతాల నుండి స్వామి వారిని దర్శించు కునేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని స్పష్టం చేశారు మంత్రి కొండా సురేఖ. ఇదిలా ఉండగా ఆమె గతంలో కూడా మంత్రిగా పని చేశారు. తాజాగా దేవాదాయ శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. రాష్ట్రంలో కొత్తగా కొలువు తీరిన తమ ప్రభుత్వం దేవాలయాల పునరుద్దరణ, అభివృద్దికి కృషి చేస్తామని స్పష్టం చేశారు. అన్ని దేవాలయాలలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శనాలు అయ్యేలా చూస్తామన్నారు.