ANDHRA PRADESHNEWS

మున్సిప‌ల్ కార్మికుల‌కు ఖుష్ క‌బ‌ర్

Share it with your family & friends

స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి స‌ర్కార్ హామీ

అమ‌రావ‌తి – ఎన్నిక‌ల వేళ ఏపీ స‌ర్కార్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు రాష్ట్రంలోని మున్సిప‌ల్ కార్మికుల‌కు తీపి క‌బురు చెప్పింది. గత కొంత కాలంగా త‌మ స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాల‌ని కోరుతూ పెద్ద ఎత్తున ఆందోళ‌న ప‌ట్టారు. ఆపై మెరుపు స‌మ్మెకు దిగారు. దీంతో స‌ర్కార్ తొలుత మున్సిప‌ల్ కార్మిక సంఘాల నేత‌ల‌తో చ‌ర్చ‌లు జ‌రిపింది. ఈ చ‌ర్చ‌ల్లో మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ పాల్గొన్నారు. కానీ తొలి విడ‌త చ‌ర్చ‌లు ఫ‌లించ లేదు.

తాము ముందుకే వెళ‌తామ‌ని ప్ర‌క‌టించ‌డం, ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణా రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేయ‌డంతో ప‌రిస్థితి చేయి దాటి పోతుంద‌ని గ్ర‌హించిన సీఎం వెంట‌నే స‌మ‌స్య‌కు పుల్ స్టాప్ పెట్టాల‌ని ఆదేశించారు.

దీంతో ఎట్ట‌కేల‌కు మున్సిప‌ల్ కార్మిక సంఘాల‌తో జ‌రిపిన రెండో విడ‌త చ‌ర్చ‌లు ఫ‌ల‌ప్ర‌దం అయ్యాయి. ఈ సంద‌ర్బంగా స‌మ్మె విర‌మిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు సంఘాల నేత‌లు. మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ ఇందుకు సంబంధించి క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు.

ప్ర‌భుత్వ హామీల‌కు కార్మిక సంఘాలు ఆమోదం తెలిపాయ‌ని చెప్పారు. రూ. 21 వేల వేత‌నంతో పాటు ఇత‌ర స‌దుపాయాలు క‌ల్పిస్తామ‌ని , స‌మ్మె కాలానికి జీతాలు కూడా చెల్లిస్తామ‌ని అన్నారు. వారిపై ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదు చేసిన కేసులు ఎత్తి వేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు మంత్రి. అంతే కాకుండా సంక్రాంతి పండుగ సంద‌ర్బంగా ప్ర‌తి కార్మికునికి కొత్త బ‌ట్ట‌ల కోసం రూ. 1000 ఇస్తామ‌ని ప్ర‌క‌టించారు.