మెట్రో లైన్ల విస్తరణకు లైన్ క్లియర్
ప్రణాళికలు సిద్దం చేసిన సర్కార్
హైదరాబాద్ – తెలంగాణలో కొత్తగా కొలువు తీరిన కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మెట్రో లైన్లను విస్తరించేందుకు ఓకే చెప్పింది. ఇందులో భాగంగా ప్రణాళికలు సిద్దం చేసింది. కారిడార్లుగా విభజించింది. కారిడార్ 2 కింద ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్ నుండి ఫలక్ నుమా వరకు 5.5 కిలోమీటర్ల మేర మెట్రోను చేపట్టనుంది. ఇదే కారిడార్ కింద 1.5 కిలోమీటర్ల మేర ఫలక్ నుమా నుండి చాంద్రాయణగుట్ట దాకా విస్తరించేలా ప్లాన్ చేసింది.
కారిడార్ 4 లో నాగోల్ మెట్రో స్టేషన్ నుండి ఎల్‌బి నగర్ మెట్రో స్టేషన్ వరకు , చాంద్రాయణగుట్ట క్రాస్ రోడ్ నుండి మైలార్‌దేవ్‌పల్లి, పి 7 రోడ్‌ను శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు కలుపుతూ మెట్రో రైల్ నిర్మాణం చేపట్టనున్నారు. 29 కిలోమీటర్ల మేర కొనసాగుతుంది.
ఇదే కారిడార్ కింద మైలార్‌దేవ్‌పల్లి నుంచి ఆరామ్‌ఘర్ మీదుగా రాజేంద్ర నగర్ వద్ద ప్రతిపాదిత హైకోర్టు వరకు మెట్రోను విస్తరించనున్నారు. దీని దూరం 4 కిలోమీటర్ల మేర ఉంటుంది. కారిడార్ 5 లో రాయదుర్గం మెట్రో స్టేషన్ నుండి బయోడైవర్సిటీ జంక్షన్, నానక్రామ్‌గూడ జంక్షన్, విప్రో జంక్షన్ , అమెరికన్ కాన్సులేట్ వరకు మెట్రోను విస్తరిస్తారు. దీని దూరం 8 కిలోమీటర్ల మేర ఉంటుంది.
కారిడార్ 6లో మియాపూర్ మెట్రో స్టేషన్ నుండి బీహెచ్ఈఎల్ , పటాన్ చెరు దాకా, 14 కిలోమీటర్ల మేర మెట్రో రానుంది. కారిడార్ 7 లో ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ నుండి వనస్థలిపురం , హయత్ నగర్ దాకా 8 కిలోమీటర్ల మేర మెట్రో రైల్ నిర్మాణం చేపట్టనుంది ప్రభుత్వం.