మేడారం పోస్టర్ ఆవిష్కరణ
ఫిబ్రవరి 21 నుంచి జాతర
ములుగు జిల్లా – ప్రపంచంలోనే అతి పెద్ద జాతరగా భావించే మేడారం జాతర కోసం ముస్తాబవుతోంది. వచ్చే నెల 21 నుంచి మహా జాతర ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా రాష్ట్ర మంత్రులు దాసరి సీతక్క, కొండా సురేఖ మేడారంలోనే కొలువు తీరారు. ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. దాదాపు 50,00,000 మంది భక్తులు మేడారం జాతరకు రానున్నట్లు అంచనా. దీనిపై కొత్తగా కొలువు తీరిన సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు.
శనివారం మేడారం జాతరకు సంబంధించి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో మేడారం మహా జాతర పోస్టర్ ను సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీఎంతో పాటు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ గౌడ్ , రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. మంత్రులతో పాటు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి విట్టా సర్వేశ్వర్ రెడ్డి కూడా హాజరయ్యారు.
ఇక మేడారం త్యాగానికి ప్రతీక. ఆదివాసీలు, ఇతర ప్రజలు సమ్మక్క, సారలమ్మల పోరాటాన్ని జాతర సందర్బంగా గుర్తు చేసుకుంటారు.