మోదీజీ భద్రాద్రి రాముడు వద్దా
ప్రశ్నించిన మాజీ ఎంపీ విజయ శాంతి
హైదరాబాద్ – మాజీ ఎంపీ , కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు విజయ శాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. అయోధ్యలో రాముడి ఆలయం పునర్ నిర్మాణం గురించి గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారని పేర్కొన్నారు. ట్విట్టర్ వేదికగా ఇవాళ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో తెలంగాణలోని భద్రాచలంలో కొలువు తీరిన సీతారామచంద్ర స్వామి ఆలయం గురించి ఎందుకు పట్టించు కోవడం లేదంటూ ప్రశ్నించారు.
అయోధ్య రాముడిని ఎంత అభిమానిస్తామో అలాగే ఇక్కడి రెండు రాష్ట్రాలకు చెందిన తెలుగు వారంతా భక్తి భావంతో కొలుస్తారని తెలిపారు. కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా భద్రాద్రి నెలకొందని పేర్కొన్నారు. ఇదే సమయంలో అయోధ్య రాముడితో పాటు భద్రాద్రి రాముడిని కూడా ఆదరించాలని దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి విన్నవించారు.
ఇకనైనా ప్రాంతాలకు అతీతంగా దేశంలోని ప్రధాన దేవాలయాలను అభివృద్ది చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నో సార్లు తెలంగాణ ప్రాంతాన్ని సందర్శించారని, ఎన్నో ప్రచార సభల్లో పాల్గొన్నారని కానీ ఏనాడూ భద్రాచలం శ్రీ సీతారామ చంద్ర స్వామి వార్లను ఎందుకు దర్శించుకోలేక పోయారంటూ ప్రశ్నించారు విజయశాంతి. ఆమె చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.