ANDHRA PRADESHNEWS

మోదీ నేతృత్వంలో రైల్వే వ్య‌వ‌స్థ అభివృద్ది

Share it with your family & friends

స్ప‌ష్టం చేసిన కేంద్ర మంత్రి జి. కిష‌న్ రెడ్డి

విజ‌య‌వాడ – కేంద్ర ప‌ర్యాట‌క శాఖ మంత్రి గంగాపురం కిష‌న్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. విజ‌య‌వాడ‌లో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో ఆయ‌న ముఖ్య అతిథిగా హాజ‌రై ప్ర‌సంగించారు. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ సార‌థ్యంలో రైల్వే వ్య‌వ‌స్థ మ‌రింత ప‌రుగులు తీస్తోంద‌న్నారు. రైల్వేల‌కు అత్యంత ప్రాధాన్య‌త ఇవ్వ‌డం జ‌రిగింద‌న్నారు. అత్యంత వేగవంతంగా గ‌మ్యాన్ని చేరుకునేందుకు వందే భార‌త్, భార‌త్ రైళ్ల‌ను ప్ర‌వేశ పెట్టామ‌ని చెప్పారు జి. కిష‌న్ రెడ్డి.

జనరల్ బడ్జెట్ లో రైల్వేను విలీనం చేసి.. ఆర్ధిక పరమైన సహకారం మోడీ అందిస్తున్నారని చెప్పారు. డిజిటల్ అడ్వాన్స్ టెక్నాలజీ తో రైళ్లు నడుపుతున్నార‌ని తెలిపారు కేంద్ర మంత్రి. ప్ర‌పంచంలోనే రైల్వే నెట్ వ‌ర్క్ లో భార‌త దేశం నాలుగో స్థానంలో ఉంద‌ని వెల్ల‌డించారు.

దేశ స‌మ‌గ్ర‌త‌కు రైల్వే వ్య‌వ‌స్థ అద్దం ప‌డుతోంద‌న్నారు. అన్ని రైల్వే స్టేష‌న్ల‌ను ఆధునీక‌రించి కొత్త హంగుల‌తో తీర్చి దిద్దుతున్నామ‌ని తెలిపారు. 508 ర్వైల్వే స్టేషన్లను అమృత్ పధకంలో భాగంగా అభివృద్ది చేసేందుకు మోడీ భూమి పూజ చేశారని చెప్పారు జి. కిష‌న్ రెడ్డి. ప్రధాన మంత్రి ఒకే రోజు ఇన్ని పనులు ప్రారంభించడం గిన్నీస్ రికార్డు అని అన్నారు.

ఈ ప‌నుల అభివృద్ది కోసం రూ. 25,000 కోట్లను కేంద్రం ఖర్చు చేస్తోంద‌న్నారు. దేశంలో ఇప్ప‌టి దాకా 41 వందే భారత్ రైళ్లు మొద‌ల‌య్యాయ‌ని తెలిపారు. సెమీ హై స్పీడ్ రైళ్ల‌ను స్వ‌దేశీ టెక్నాల‌జీతో మ‌న‌మే న‌డిపించామ‌ని పేర్కొన్నారు.

వందే భారత్ తో హైదరాబాద్, విజయవాడ, తిరుపతి, చెన్నై, విశాఖకు కనెక్టివిటీ చేశామ‌న్నారు. ఐదు వందే భారత్ రైళ్లు విజయవాడ మీదుగా ప్రయాణం సాగిస్తున్నాయ‌ని చెప్పారు. వచ్చే ఐదేళ్లల్లో పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు భారీగా పెరగనున్నాయ‌ని పేర్కొన్నారు.