మోదీ ప్రభుత్వం యువతకు శాపం
నిప్పులు చెరిగిన రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ – ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. దేశంలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యమై పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. రోజు రోజుకు నిరుద్యోగం పెరుగుతోందని, కానీ పట్టించుకున్న పాపాన పోలేదంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఓ వైపు ద్రవ్యోల్బణం ఇంకో వైపు నిరుద్యోగం అనకొండలా పెరుగుతోందన్నారు రాహుల్ గాంధీ. భారత్ జోడో న్యాయ్ యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ ప్రసంగించారు. దేశంలోని యువత తీవ్ర నిరాశలో ఉందన్నారు. మోదీ మరోసారి యువత చెవుల్లో పూలు పెట్టారంటూ మండిపడ్డారు.
సాధారణ కుటుంబాల నుంచి వచ్చి రోజుకు 18 గంటలకు పైగా కష్టపడి చదువుతున్నారని , చిన్న చిన్న అద్దె గదుల్లో ఉంటూ భారీ కలలు కంటున్నారని , కానీ ఇప్పటి వరకు ప్రతి ఏటా ఇస్తానన్న 2 కోట్ల జాబ్స్ ఎక్కడ భర్తీ చేశారో చెప్పాలని నిలదీశారు రాహుల్ గాంధీ.
రైల్వే శాఖలో లక్షలాదిగా పోస్టులు ఖాళీగా ఉన్నాయని కానీ ఈ ఐదేళ్ల కాలంలో కేంద్రం కేవలం 5,696 పోస్టులను మాత్రమే భర్తీ చేయడం ప్రభుత్వ అలసత్వానికి, బాధ్యతా రాహిత్యానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు వాయనాడు ఎంపీ.