యాత్రను అడ్డుకోవడం దారుణం
నిప్పులు చెరిగిన యోగేంద్ర యాదవ్
ప్రముఖ సామాజిక వేత్త యోగేంద్ర యాదవ్ నిప్పులు చెరిగారు. దేశంలో ప్రజాస్వామ్యానికి ప్రమాదం ఏర్పడిందని ఆవేదన చెందారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్రలో ఆయన కూడా పాల్గొంటున్నారు. బేషరతు మద్దతు తెలిపారు. ముందు నుంచీ కూడా తనదైన శైలిలో గొంతుకగా ఉంటూ వచ్చారు యోగేంద్ర యాదవ్.
ఈ దేశంలో మతం ఇవాళ కీలకంగా మారిందని, అది అందరిపై పెత్తనం చెలాయించే స్థాయికి చేరుకుందని ఆరోపించారు. దీనికి ప్రధాన కారణం కేంద్రంలో కొలువు తీరిన మోదీ సర్కార్ అని ఆరోపించారు. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదన్నారు.
భారత రాజ్యాంగం అందరికీ సమాన హక్కులు, అవకాశాలు కల్పించిందని అన్నారు యోగేంద్ర యాదవ్. భారత్ జోడో న్యాయ్ యాత్ర అనేది ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలియ చేసేందుకు చేపట్టడం జరిగిందన్నారు. అస్సాం సీఎం ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకుడిపై దాడికి దిగడం దారుణమన్నారు. ఇవాళ శ్రీమంత్ శర్కర్ దేవ్ సత్రం నుండి యాత్రను ప్రారంభించాల్సి ఉందని, పోలీసులు అడ్డుకోవడంపై మండిపడ్డారు.