యుగ పురుషుడు ఎన్టీఆర్
నారా చంద్రబాబు నాయుడు
నారావారి పల్లె – దివంగత సీఎం నందమూరి తారక రామారావు చేసిన సేవల గురించి ఎంత చెప్పినా తక్కువేనని అన్నారు టీడీపీ చీఫ్, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. సంక్రాంతి పండుగ సందర్బంగా చిత్తూరు జిల్లాలోని తన స్వంతూరు నారా వారి పల్లెకు కుటుంబ సమేతంగా చేరుకున్నారు.
ఆయనతో పాటు తనయుడు నారా లోకేష్ బాబు, కోడలు నారా బ్రాహ్మణి , కుటుంబీకులు పాల్గొన్నారు. గ్రామ దేవతలు గంగమ్మ, నాగమ్మలకు పూజలు చేశారు. తన తల్లిదండ్రుల సమాధి వద్ద చంద్రబాబు నాయుడు, కుటుంబీకులు నివాళులు అర్పించారు.
అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ తన మామ గారైనందుకు గర్వ పడుతున్నానని అన్నారు. ఆయన నుంచి తాను పాలనా పరంగా ఎన్నో నేర్చుకున్నానని , ఆయనే తనకు ఆదర్శమన్నారు.
తెలుగుదేశం పార్టీని స్థాపించి ప్రపంచంలోనే తక్కువ సమయంలో అధికారంలోకి వచ్చేలా చేసిన మహనీయుడు నందమూరి తారక రామారావు అని కొనియాడారు నారా చంద్రబాబు నాయుడు. ఈసారి జరగబోయే ఎన్నికలు నీతికి, అవినీతికి మధ్య జరుగుతున్నాయని అన్నారు.