రాముడికి హనుమాన్ విరాళం
ప్రకటించిన చిత్రం యూనిట్
ప్రశాంత్ వర్మ తీసిన హనుమాన్ చిత్రం ఊహించని రీతిలో వసూళ్లు సాధించింది. దేశ వ్యాప్తంగా, ఓవర్సీస్ లో కూడా దుమ్ము రేపింది. బాక్సులు బద్దలయ్యాయి వసూళ్లతో. కేవలం రూ. 25 కోట్లు ఖర్చు పెట్టి హనుమాన్ తీశాడు దర్శకుడు. ఈ సినిమా ముందు ప్రిన్స్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం బోసి పోయింది. ఆ సినిమాకు ఎక్కువ థియేటర్లు కేటాయించి, హనుమాన్ కు తక్కువ టాకీస్ లు అప్పగించడం ఒకింత ఇబ్బందిని కలిగించింది. చివరకు తాము అడ్డుకోలేదంటూ నిర్మాత దిల్ రాజు ప్రకటించారు.
మరో వైపు హనుమాన్ ఇంకా ఇంకెన్ని కోట్లు సాధిస్తుందని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు సినీ వర్గాలు. ఇక ఇప్పటి వరకు ఈ మూవీ ఏకంగా రూ. 150 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇదిలా ఉండగా సినిమా రిలీజ్ సందర్బంగా దర్శకుడు ప్రశాంత్ వర్మ సంచలన ప్రకటన చేశాడు. తమ సినిమాకు సంబంధించి అమ్ముడు పోయే ప్రతి టికెట్ పై అయోధ్య లోని రామ మందిరానికి రూ. 5 చొప్పున విరాళంగా అందజేస్తానని చెప్పాడు.
చెప్పిన విధంగానే ఇప్పటి వరకు 53 లక్షల 28 వేల 211 టికెట్లు అమ్ముడు పోయాయని, వీటి ద్వారా వచ్చిన ఆదాయంలో రూ. 2, 66, 41,055 రూపాయలను విరాళంగా అందజేసినట్లు ప్రకటించింది చిత్ర యూనిట్.