రాహుల్ గాంధీ అరుదైన నేత
సీఎం రేవంత్ రెడ్డి కితాబు
హైదరాబాద్ – తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన తన మనసులోని మాట చెప్పేశారు. తను ఈ స్థాయిలో ఉండడానికి కారణం రాహుల్ గాంధీ అని స్పష్టం చేశారు. అంతే కాదు సోనియా గాంధీ కుటుంబం తనను ఆదరించిందని , కాంగ్రెస్ పార్టీ తనకు కావాల్సినవన్నీ ఇచ్చిందని తెలిపారు.
ఇదే సమయంలో రాహుల్ గాంధీ ఈ దేశంలో ఉన్న నేతలలో అరుదైన నాయకుడని కితాబు ఇచ్చారు ఎనుముల రేవంత్ రెడ్డి. ఆయనకు అన్ని అంశాల పట్ల అవగాహన ఉందన్నారు. అడ్డగోలుగా ఏది పడితే అది మాట్లాడేందుకు ఇష్ట పడరన్నారు.
ఒకానొక దశలో తాను దూకుడు ప్రదర్శించినా ఇతర నేతలతో ఎలా ఉండాలో కూడా రాహుల్ గాంధీ తనను గైడ్ చేశారని గుర్తు చేశారు. తనకు పీసీసీ చీఫ్ పదవి కట్టబెట్టిన సమయంలో తనకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారని చెప్పారు. దీనిని తూచ తప్పకుండా తాను పాటిస్తూ వచ్చానని చెప్పారు ఎనుముల రేవంత్ రెడ్డి.
ఈ దేశ భవిష్యత్తు బాగు పడాలంటే రాహుల్ గాంధీ నేతృత్వం రావాలని ఆకాంక్షించారు. ఇదే సమయంలో రేవంత్ రెడ్డి ప్రధాన మంత్రి మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా, రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ , ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లు అందించిన సహకారం మరిచి పోలేనని అన్నారు.