రికార్డు స్థాయిలో వైకుంఠ ద్వారా దర్శనం
తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ధర్మా రెడ్డి
తిరుమల – ఈసారి రికార్డు స్థాయిలో తిరుమల కొలువై ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ అలివేలు మంగమ్మ అమ్మ వారిని భక్తులు దర్శించుకున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ఏవీ ధర్మా రెడ్డి వెల్లడించారు. వైకుంఠ ద్వార దర్శనం ముగిసిందని 6.47 లక్షల మంది భక్తులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్నారని తెలిపారు.
గత ఏడాది డిసెంబర్ 23 నుండి ఈ ఏడాది 2024 జనవరి 1వ తేదీ వరకు 10 రోజుల పాటు స్వామి, అమ్మ వార్లను దర్శించుకున్నట్లు స్పష్టం చేశారు ఏవీ ధర్మా రెడ్డి. సుదూర ప్రాంతాల నుండి తిరుమలకు విచ్చేసిన భక్త బాంధవులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శన భాగ్యం కల్పించినట్లు చెప్పారు.
అయితే అన్న ప్రసాదాలు స్వీకరించిన భక్తుల సంఖ్య గతంలో కంటే ఈసారి మరింత పెరిగిందన్నారు. చలి తీవ్రతను పురస్కరించుకుని విస్తృతంగా ఏర్పాట్లు చేశామన్నారు. ఇందుకు గాను టైం స్లాట్ టోకెన్లు జారీ చేసినట్లు వెల్లడించారు ఈవో.
ఈ పది రోజులకు కలిపి వీఐపీ బ్రేక్ దర్శనానికి సంబంధించి మొత్తం 19,255 టికెట్లు జారీ చేశామని ఇందులో 18, 578 మంది హాజరయ్యారని 677 మంది దర్శించు కోలేక పోయారని ఏవీ ధర్మా రెడ్డి స్పష్టం చేశారు. ఇక దాతల విషయానికి వస్తే ఆన్ లైన్ లో 6,858 మంది టికెట్లు బుక్ చేసుకుంటే 6,388 మంది స్వామిని దర్శించుకున్నట్లు తెలిపారు.