రేవంత్ అదానీ ములాఖత్
మాజీ మంత్రి కేటీఆర్ కామెంట్స్
హైదరాబాద్ – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన కామెంట్స్ చేశాడు. హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో మహబూబ్ నగర్ నియోజకవర్గ లోక్ సభ సమీక్ష సమావేశం జరిగింది. సమావేశం అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
దావోస్ లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో అదానీ గ్రూప్ సంస్థల చైర్మన్ గౌతమ్ అదానీ తో సీఎం రేవంత్ రెడ్డి ములాఖత్ అయ్యారని, అందుకే రూ. 12,400 కోట్లు పెట్టుబడులు పెడుతున్నట్లు ప్రకటించారని, ఇప్పటికే నాలుగు ఒప్పందాలపై సంతకాలు కూడా చేశారని తెలిపారు.
ఓ వైపు ఏఐసీసీ మాజీ చీఫ్, వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ అదానీ, ముకేష్ అంబానీ , టాటాలను నిత్యం విమర్శిస్తూ వచ్చారని కానీ ఇదే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని తెలంగాణ ప్రభుత్వం మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోందంటూ ఆరోపించారు.
కేంద్రంలో కొలువు తీరిన బీజేపీ ఆదేశాల మేరకు కాంగ్రెస్ సర్కార్ అదానీతో కలిసి పని చేస్తున్నారని ధ్వజమెత్తారు కేటీఆర్. కాంగ్రెస్ ఢిల్లీలో అదానితో పోరాడుతోందని కానీ తెలంగాణలో ఎందుకు కలిసి పని చేస్తోందని ప్రశ్నించారు. మోదీ , అదానీ ఒక్కటేనని రాహుల్ గాంధీ అన్నారని, మరి ఇప్పుడు ఏమంటారంటూ నిలదీశారు కేటీఆర్.