లండన్ కు చేరుకున్న రేవంత్
ప్రముఖులతో భేటీ కానున్న సీఎం
లండన్ – ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొన్న అనంతరం లండన్ కు చేరుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆయన వెంట ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కార్యదర్శి జయేష్ రంజన్ ఉన్నారు. దాదాపు రూ.37,000 కోట్లకు పైగా పెట్టుబడులు తెలంగాణ రాష్ట్రానికి తీసుకు రావడంలో కీలకమైన పాత్ర పోషించారు సీఎం.
దావోస్ పర్యటనలో ప్రముఖులను కలుసుకున్నారు. వీరిలో అదానీ గ్రూప్ సంస్థల చైర్మన్ గౌతమ్ అదానీ, విప్రో చైర్మన్ రషీద్ ప్రేమ్ జీ, టాటా సన్స్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ , గోద్రెజ్ సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ నీరజ్ గోద్రెజ్ లతో భేటీ అయ్యారు.
ప్రస్తుతం లండన్ కు చేరుకున్న రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం లభించింది. ప్రవాస భారతీయులు , ప్రధానంగా తెలంగాణ ఎన్నారైలు గ్రాండ్ వెల్ కమ్ చెప్పారు రేవంత్ రెడ్డికి. ఈ సందర్బంగా ఆయన యూకేలోని వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారులు, సీఇవోలు, చైర్మన్లు, మేనేజింగ్ డైరెక్టర్లను కలుసుకోనున్నారు.
ఇదే సమయంలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరైనా రావచ్చని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. తమది అనుకూలమైన సర్కార్ అని పేర్కొన్నారు.