లక్షల కోట్ల అప్పుల సంగతేంటి
బీజేపీ మాజీ చీఫ్ బండి సంజయ్
హైదరాబాద్ – భారతీయ జనతా పార్టీ మాజీ చీఫ్ , కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ షాకింగ్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ మాయ మాటలు నమ్మి అధికారాన్ని కట్టబెట్టారని , అయితే 6 గ్యారెంటీలను ఏ విధంగా అమలు చేస్తారని ప్రశ్నించారు. సోమవారం బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు.
గతంలో కొలువు తీరిన కేసీఆర్ సర్కార్ ఏకంగా నాలుగున్నర కోట్ల ప్రజలపై మోయలేని భారం మోపారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఏకంగా రూ. 6 లక్షల కోట్ల అప్పును ఎలా తీరుస్తారంటూ నిలదీశారు. ఆరు గ్యారెంటీలను నిధులను ఎక్కడి నుంచి తెస్తారంటూ మండిపడ్డారు.
త్వరలో రాష్ట్రంలో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడం ఖాయమని అన్నారు. దేశంలో మరోసారి మోదీ ప్రభంజనం కొనసాగుతుందన్నారు బండి సంజయ్. ప్రజలు రోడ్లపైకి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత సీఎం రేవంత్ రెడ్డిపై ఉంటుందన్నారు.
ఉన్న అప్పులు తీర్చేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేస్తారో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ముచ్చటగా మూడోసారి దేశంలో బీజేపీ సంకీర్ణ సర్కార్ అధికారంలోకి వస్తుందని చెప్పారు. ప్రజలు ఇండియా కూటమిని నమ్మడం లేదని, సమర్థవంతమైన పాలన అందించే తమకు ఓట్లు వేయడం తప్పదన్నారు.