లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయను
స్పష్టం చేసిన మాజీ పీఎం దేవెగౌడ
కర్ణాటక – జనతాదళ్ ఎస్ పార్టీ చీఫ్, మాజీ ప్రధాన మంత్రి హెచ్ డి దేవెగౌడ సంచలన ప్రకటన చేశారు. త్వరలో జరిగే లోక్ సభ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం తనకు 90 ఏళ్లు అని, వయసు సహకరించడం లేదని అన్నారు. అయితే బరిలో ఉండక పోయినా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని చెప్పారు.
దేవె గౌడ మీడియాతో మాట్లాడారు. తన పోటీ కంటే పార్టీని నిలబెట్టడం ముఖ్యమన్నారు. ఎన్ని సీట్లు వచ్చినా ఎక్కడ అవసరం వచ్చినా తాను ముందుంటానని అన్నారు దేవె గౌడ. నాకు ఏ మాత్రం జ్ఞాపక శక్తి తగ్గలేదన్నారు. అందుకే ప్రచారంలో కీలక పాత్ర పోషిస్తానని చెప్పారు మాజీ ప్రధాన మంత్రి.
అయితే జేడీఎస్ రాష్ట్ర చీఫ్, మాజీ సీఎం హెచ్ డీ కుమార స్వామి లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయడంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఏది చెబితే దానిని పాటిస్తానని అన్నారు.
అయోధ్యలో కొత్తగా నిర్మించిన రామ మందిరం గర్భగుడిలో శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించే ముందు మోదీ 11 రోజుల పాటు తీవ్రంగా తపస్సు చేశారని గౌడ ప్రశంసించారు.