విద్యార్థులకు టెస్టు మ్యాచ్ ఫ్రీ
ఖుష్ కబర్ చెప్పిన హెచ్ సీ ఏ
హైదరాబాద్ – క్రికెట్ ప్రియులకు శుభవార్త చెప్పింది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్ సీ ఏ). ఈ మేరకు అసోసియేషన్ ప్రెసిడెంట్ జగన్ మోహన్ రావు కీలక ప్రకటన చేశారు. నూతన ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వ బడులలో చదువుకునే విద్యార్థులకు ఉచితంగా టెస్టు మ్యాచ్ చూసేందుకు ఫ్రీ టికెట్లు ఇస్తున్నట్లు తెలిపారు. అంతే కాకుండా వారికి ఉచితంగా మధ్యాహ్న భోజనం కూడా అందజేయనున్నట్లు వెల్లడించారు.
ఇలాంటి అవకాశం గతంలో ఎన్నడూ ఇవ్వలేదని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఇండియా, ఇంగ్లండ్ జట్ల మధ్య ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో టెస్టు మ్యాచ్ జరగనుంది. ఈనెల 18 నుంచి పే టీఎం ఇన్ సైడర్ యాప్ లో టికెట్లను విక్రయించనున్నట్లు తెలిపారు జగన్ మోహన్ రావు.
22 నుండి ఆఫ్ లైన్ లో టికెట్లు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. 25 వేల మంది విద్యార్థులకు ఉచితంగా టికెట్లు ఇవ్వాలని అనుకుంటున్నట్లు హెచ్ సీ ఏ చీఫ్ స్పష్టం చేశారు. అంతే కాకుండా భారత సాయుధ దళాల కుటుంబాలకు చెందిన వారు జనవరి 26 గణతంత్ర దినోత్సవం రోజున ఉచితంగా చూడొచ్చని తెలిపారు.