వైఎస్సార్ ఆశయాల కోసమే చేరా
స్పష్టం చేసిన వైఎస్ షర్మిలా రెడ్డి
కడప – ఏపీ పీసీసీ చీఫ్ గా నియమితులైన వైఎస్ షర్మిలా రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆమెకు ఘన స్వాగతం లభించింది. తన తండ్రి, దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాల కోసమే తాను కాంగ్రెస్ పార్టీలో చేరానని స్పష్టం చేశారు. షర్మిల వెంట కేవీపీ రామచంద్రరావు, మాజీ పీసీసీ చీఫ్ నీలకంఠాపురం రఘువీరా రెడ్డి ఉన్నారు.
ముందుగా వైఎస్సార్ సమాధి వద్దకు వెళ్లారు. తన తండ్రికి నివాళులు అర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు వైఎస్ షర్మిల. తండ్రి ఆశీర్వాదం కోసమే ఇడుపులపాయకు వచ్చానని చెప్పారు.
రాజశేఖర్‌రెడ్డికి కాంగ్రెస్ పార్టీ అంటే పంచ ప్రాణం అని, చివరి వరకు ప్రజల కోసం పని చేసిన మహా నాయకుడని కొనియాడారు.
మన దేశంలో సెక్యులరిజం అనే పదానికి అర్థమే లేకుండా పోయిందన్నారు వైఎస్ షర్మిల. రాజ్యాంగానికి గౌరవం లేదన్నారు. ఇవాళ కులం, మతం పేరుతో రాజకీయాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశం క్లిష్ట సమయంలో ఉందని, ప్రజలు తమ పార్టీకి మద్దతుగా నిలవాలని ఆమె కోరారు.