శారదా పీఠాధిపతి అవినీతికి అధిపతి
జనసేన పార్టీ చీఫ్ షాకింగ్ కామెంట్స్
విశాఖపట్టణం – విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామిపై సంచలన ఆరోపణలు చేసింది జనసేన పార్టీ. పీఠం పేరుతో అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారంటూ ఆరోపించింది. విశాఖలో పండుగాడి పేరుతో బ్లాక్ లో సినిమా టికెట్లు అమ్మిన వ్యక్తి పీఠాధిపతి ఎలా అయ్యాడో తేల్చాల్సిన అవసరం ఉందని పేర్కొంది.
పీఠం పేరుతో భూములను ఆక్రమించుకున్నారంటూ వాపోయింది. సీఎం జగన్ మోహన్ రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు, మంత్రుల నుంచి వ్యాపారవేత్తల దాకా కానుకల రూపేణా వందల కోట్లకు పైగా కానుకలు ముట్టాయని ఆవేదన వ్యక్తం చేసింది. భక్తి పేరుతో సేవలు అందించాల్సిన స్వామీజీకి స్పెషల్ ఫ్లైట్ , ప్రోటోకాల్ , స్పెషల్ సెక్యూరిటీ ఎలా కల్పిస్తారంటూ ప్రశ్నించింది జనసేన పార్టీ.
స్వరూపానందను నమ్ముకుంటే కేసీఆర్ కు పట్టిన గతే ఏపీలో జగన్ కు పడుతుందని హెచ్చరించింది. పలు ఆలయాలను కబ్జా చేసేందుకు ప్లాన్ చేశారని ఆరోపించారు జనసేన పార్టీ కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ .
అన్యాయాలు, అక్రమాలు, భూ లావాదేవీలకు కేరాఫ్ గా శారదా పీఠం మారిందని మండిపడ్డారు. స్వామికి జగన్ మోహన్ రెడ్డి విశాఖలో రూ. 250 కోట్ల విలువ చేసే 15 ఎకరాల భూమిని ధారాదత్తం చేశారంటూ ధ్వజమెత్తారు.
భీమునిపట్నం కి పక్కనే ఉన్న సర్వే నెంబర్ 102 /2 లో 7.70 ఎకరాలు 103 లో 7:30 ఎకరాలు కేవలం 15 లక్షల రూపాయలకు కానుకగా సమర్పించడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. రూ. 2 కోట్ల ప్రజా ధనంతో ఏకంగా రహదారిని కూడా మఠం దాకా నిర్మించారని అన్నారు. వేద పాఠశాల, ఆధ్యాత్మిక సేవల పేరుతో వ్యాపారాలు నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని దరఖాస్తు చేసుకున్నారని ఆరోపించారు.
నకిలీ స్వామిగా, దొంగ స్వామిగా పేరు పొందిన శారదా పీఠాధిపతి చేతుల్లో ఉన్న భూములను జగనన్న కాలనీగా మార్చాలని డిమాండ్ చేశారు. జగన్ మోహన్ రెడ్డికి స్వరూపానంద బినామీగా ఉన్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు పీతల మూర్తి యాదవ్.