శ్రీరాముడి చెంతకుశ్రీవారి లడ్డూలు
లక్ష లడ్డూలు పంపిణీ చేయనున్న ట్రస్టు
తిరుమల – దేశ వ్యాప్తంగా ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్న అయోధ్య లోని రామ మందిరం పునః ప్రతిష్టాపన కార్యక్రమం ఈనెల 22న సోమవారం అంగరంగ వైభవంగా జరగనుంది. శ్రీరామ మందిర ట్రస్టు అభ్యర్థన మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని పంపిణీ చేసింది. లక్షకు పైగా లడ్డూలను పంపించినట్లు టీటీడీ ఏఈవో వీరబ్రహ్మం తెలిపారు. ఈ లడ్డూలను జాగ్రత్తగా ప్యాకింగ్ చేసినట్లు పేర్కొన్నారు.
తిరుమలలోని శ్రీవారి సేవా సదన్-1 నుంచి శ్రీవారి లడ్డూ ప్రసాదంతో కూడిన బాక్సులను తిరుపతి ఎయిర్ పోర్టుకు తరలించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా సేవా సదన్ వద్ద శ్రీ వీరబ్రహ్మం మీడియాతో మాట్లాడారు. అయోధ్యకు ఒక లక్ష చిన్న లడ్డూలను శ్రీవారి ప్రసాదంగా పంపాలని టీటీడీ ధర్మకర్తల మండలి నిర్ణయించిందన్నారు.
ఇందుకోసం టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు భూమన కరుణాకర రెడ్డి, ఈవో ఏవీ ధర్మారెడ్డి ప్రత్యేక శ్రద్ధతో స్వచ్ఛమైన దేశీయ ఆవు నెయ్యిని వినియోగించి లడ్డూలు తయారు చేయించినట్లు చెప్పారు. లడ్డూల తయారీకి బోర్డు సభ్యులు సౌరభ్ బోరా 2 వేల కిలోలు, మాజీ బోర్డు సభ్యులు జూపల్లి రామేశ్వరరావు 2 వేల కిలోల దేశీయ ఆవు నెయ్యిని విరాళంగా అందించినట్లు తెలిపారు.
శ్రీవారి సేవకులతో మొత్తం 350 బాక్సుల్లో ఒక లక్ష లడ్డూలను ప్యాకింగ్ చేశామని చెప్పారు. మరో బోర్డు సభ్యులు శరత్ చంద్రారెడ్డి సహకారంతో ఈ లడ్డూలను తిరుపతి విమానాశ్రయం నుంచి ప్రత్యేక కార్గో విమానం(ఏరో గ్రూపు) ద్వారా అయోధ్యకు పంపామన్నారు. ఈ లడ్డూ ప్రసాదాన్ని అయోధ్యలో రామ జన్మ భూమి తీర్థక్షేత్ర ట్రస్టుకు అందజేశామన్నారు.