DEVOTIONAL

శ్రీ‌వారి కోసం పోటెత్తిన భ‌క్త‌జ‌నం

Share it with your family & friends

శ్రీ‌వారి హుండీ ఆదాయం రూ. 3.13 కోట్లు
తిరుమ‌ల – కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా వినుతికెక్కింది తిరుమ‌ల పుణ్య క్షేత్రం. రోజు రోజుకు భ‌క్తుల ర‌ద్దీ కొన‌సాగుతూనే ఉంది. భారీ ఎత్తున త‌ర‌లి వ‌స్తున్నారు. సంక్రాంతి పండుగ పర్వ‌దినం కావ‌డంతో భ‌క్తుల తాకిడి పెరిగింది. భ‌క్త బాంధ‌వుల‌కు ఎలాంటి ఇబ్బందులు త‌లెత్త‌కుండా చ‌ర్య‌లు చేప‌ట్టింది తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (టీటీడీ).

86 వేల 107 మంది భ‌క్తులు శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి, శ్రీ అలివేలు మంగ‌మ్మ‌ల‌ను ద‌ర్శించుకున్నారు. 29 వేల 849 మంది భ‌క్తులు త‌ల‌నీలాలు స‌మ‌ర్పించుకున్నారు. భ‌క్త బాంధ‌వులు నిత్యం స‌మ‌ర్పించే కానుక‌లు, విరాళాల రూపేణా శ్రీ‌వారి హుండీ ఆదాయం రూ. 3.13 కోట్లు వ‌చ్చిన‌ట్లు టీటీడీ వెల్ల‌డించింది.

ఇదిలా ఉండ‌గా శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ పునః ప్రారంభమైంది. పవిత్రమైన ధనుర్మాసం ముగియ‌డంతో సుప్రభాత సేవ తిరిగి ప్రారంభ‌మైంది. గత ఏడాది డిసెంబరు 17వ తేదీ తెల్లవారుజామున నుండి ధనుర్మాస ఘడియలు ప్రారంభం కావడంతో శ్రీవారి ఆలయంలో సుప్రభాతం స్థానంలో గోదా తిరుప్పావై పారాయణం కొనసాగింది.

అయితే జనవరి 14వ తేదీ ధనుర్మాస ఘడియలు పూర్తికావడంతో, జనవరి 15వ తేదీ నుండి యథాప్రకారం శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ నిర్వహించారు.