షర్మిల ఎంట్రీ కాంగ్రెస్ లో లొల్లి
ఆమె వస్తే ఒప్పుకోమన్న హర్ష కుమార్
తూర్పుగోదావరి జిల్లా – కాంగ్రెస్ పార్టీలో షర్మిల చేరిక ఏపీలో కలకలం రేపుతోంది. ఆమె తెలంగాణలో పార్టీ పెట్టి అక్కడ ఉండకుండా ఏపీకి వస్తానంటే ఎలా అని ప్రశ్నించారు మాజీ ఎంపీ హర్ష కుమార్. ఇదిలా ఉండగా ఇటీవలే వైఎస్సార్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నట్లు ప్రకటించింది. అంతే కాదు ఏఐసీసీ చీఫ్ ఖర్గే, మాజీ చీఫ్ రాహుల్ సమక్షంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకుంది.
ప్రస్తుతం ఏపీకి చీఫ్ గా గిడుగు రుద్రరాజు ఉన్నారు. ఏడు గ్యారెంటీలు ప్రకటించింది ఆ పార్టీ. త్వరలోనే శాసన సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలో పార్టీ పరంగా వైఎస్ షర్మిలా రెడ్డికి ఏపీసీసీ చీఫ్ పగ్గాలు అప్పగిస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై తీవ్రంగా స్పందించారు మాజీ ఎంపీ హర్ష కుమార్.
షర్మిల కంటే అత్యంత బలమైన, సమర్థవంతమైన నాయకులు ఏపీలో ఉన్నారని స్పష్టం చేశారు. ఆమెకు ఎట్టి పరిస్థితుల్లో ఏపీ చీఫ్ గా బాధ్యతలు అప్పగించ వద్దని ఏఐసీసీని కోరారు హర్ష కుమార్. గురువారం తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో తాను అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేస్తానని స్పష్టం చేశారు.