షర్మిల కామెంట్స్ ధర్మాన సీరియస్
మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణ దాస్
నరసన్నపేట : చంద్రబాబు చివరి అస్త్రం షర్మిలేనని, వైఎస్ అభిమానుల ఓట్లు చీలితే తనకు కొంతైనా కలిసొస్తుందని భావిస్తున్నారన్నారని, రాష్ట్రంలో ఆ పరిస్థితి లేదనే వాస్తవాన్ని షర్మిల గుర్తించాలని మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణ దాస్ హితవు పలికారు.
పీసీసీ అధ్యక్ష బాధ్యతల స్వీకరణ సందర్భంగా షర్మిల చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. ఈ సందర్భంగా షర్మిలపై సంచలన ఆరోపణలు చేశారు. చంద్రబాబును ఎలా సీఎం చేయాలన్నదే షర్మిల లక్ష్యంగా కనిపిస్తోందన్నారు. అందుకే ఆయన వర్గం మీడియా షర్మిలను భుజానికి ఎత్తుకుందని ఆరోపించారు.
కాంగ్రెస్ గురించి షర్మిలకు ఏం తెలుసని ప్రశ్నించారు. వైఎస్ చనిపోయాక ఆ పార్టీ జగన్ కుటుంబాన్ని ఎన్ని రకాలుగా ఇబ్బందులకు గురి చేసిందో యావత్ తెలుగు సమాజం చూసిందన్నారు ధర్మాన కృష్ణ ప్రసాద్. అడ్డగోలుగా విభజన చేసినందుకు కాంగ్రెస్ ఏపీలో అంపశయ్యపై ఉందన్నారు.
గతంలో ఏపీలో నోటా కంటే కాంగ్రెస్ పార్టీకి తక్కువ ఓట్లు వచ్చాయని గుర్తు చేశారు. తెలంగాణ నుంచి ఏపీకి హఠాత్తుగా షర్మిల ఎందుకు షిఫ్ట్ అయ్యారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఒకప్పుడు జగనన్న వదిలిన బాణాన్ని అంటూ బిల్డప్ ఇచ్చి..ఇప్పుడు అదే నోటితో జగన్ రెడ్డి అని సంబోధించడం ఎలాంటి నైతికత అని నిలదీశారు.