షర్మిల కామెంట్స్ సజ్జల సీరియస్
ఆమె వాడిన భాష మంచి పద్దతి కాదు
అమరావతి – ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ పీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన వైఎస్ షర్మిలా రెడ్డి తమ పార్టీపై, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. సోమవారం సజ్జల రామకృష్ణా రెడ్డి మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. తాము వచ్చాక గాడి తప్పిన ఏపీ రాష్ట్ర పరిస్థితిని చక్కదిద్దామని అన్నారు. వాస్తవాలు తెలుసు కోకుండా ఎలా పడితే అలా మాట్లాడితే ఎలా అని ప్రశ్నించారు. ఒక బాధ్యత కలిగిన పదవిలో ఉన్న వారు జాగ్రత్తగా మాట్లాడాలని సూచించారు.
ప్రధానంగా షర్మిల వాడిన భాష సరికాదన్నారు. ఆమె చేసిన కామెంట్స్ తమను ఎంతగానో బాధ పెట్టాయని అన్నారు. ఇటు రాష్ట్రాన్ని అటు వైఎస్ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ కోలుకోలేని రీతిలో ద్రోహానికి పాల్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు సజ్జల రామకృష్ణా రెడ్డి.
చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్ పార్టీ కలిసి జగన్ మోహన్ రెడ్డిపై అక్రమ కేసులు బనాయించారని, ఆ విషయం తెలిసి ఎందుకు నోరు పారేసుకోవాలని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీలో చేరాక షర్మిల యాస, భాష పూర్తిగా మారి పోయాయని మండిపడ్డారు. ఇకనైనా గతం గుర్తు తెచ్చుకుని మసులుకుంటే, మాట్లాడితే బెటర్ అని సూచించారు.