సామాన్యుడి లాగనే నర్సన్న ఎంట్రీ
సచివాలయంలోకి మాజీ ఎమ్మెల్యే
హైదరాబాద్ – ఖమ్మం జిల్లా ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన ప్రజల మనిషిగా పేరు పొందారు. ప్రజా నాయకుడిగా గుర్తింపు పొందారు. ఎవరికి ఏ సమస్య వచ్చినా తాను ముందుంటారు. వారికి తన వంతు సాయం చేస్తారు. పేదలు, సామాన్యులు, అన్నార్థులకు ఆయన అండగా ఉంటూ వచ్చారు. పేరుకు ఎమ్మెల్యే అయినా ఇంకా పేద వాడిగానే ఉన్నారు.
గతంలో ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో తనకు వచ్చిన వేతనాన్ని పార్టీకి, ఆఫీసుకు అందజేశారు. తనకు పార్టీ ఇచ్చే వేతనంతోనే ఇల్లు గడిచేలా చేసుకుంటూ వచ్చారు గుమ్మడి నర్సయ్య. ప్రజలకు సంబంధించిన సమస్యలను ప్రస్తావించడం, వారి తరపున మాట్లాడటం గత కొన్నేళ్లుగా చేస్తూ వస్తున్నారు మాజీ ఎమ్మెల్యే.
శుక్రవారం అనుకోకుండా గుమ్మడి నర్సయ్య సాధారణ పౌరుడిగా సచివాలయానికి వచ్చారు. ఆయనను చూసిన వారంతా విస్మయానికి గురయ్యారు. కారణం ఏమిటంటే ఇవాళ ఏ చిన్న వార్డు సభ్యుడైనా లేదా సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీ అయినా ప్రతి ఒక్కరికీ కారు తో పాటు అధికార దర్పాన్ని ప్రదర్శించడం ఆనవాయితీగా వస్తోంది.
తాజాగా మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య సోషల్ మీడియాలో వైరల్ గా మారారు. జనం గురించి ..వారి బాధల గురించి పట్టించుకోక పోతే నాయకుడు ఎలా అవుతాడంటూ ప్రశ్నిస్తున్నారు ఆయన గురించి తెలిసిన వారు.