NEWSTELANGANA

సీఎంతో గూగుల్ వైస్ ప్రెసిడెంట్ భేటీ

Share it with your family & friends

వింగ్స్ ఆఫ్ ఫైర్స్ పుస్త‌క ర‌చ‌యిత కూడా

హైద‌రాబాద్ – ప్ర‌ముఖ ప్ర‌పంచ టెక్ దిగ్గ‌జ కంపెనీ గూగుల్ వైస్ ప్రెసిడెంట్ చంద్ర‌శేఖ‌ర్ తోట గురువారం మ‌ర్యాద పూర్వ‌కంగా సీఎం రేవంత్ రెడ్డిని క‌లుసుకున్నారు. సీఎం నివాసంలో గూగుల్ ఉపాధ్య‌క్షుడితో పాటు వింగ్స్ ఆఫ్ ఫైర్ పుస్త‌క ర‌చ‌యిత అరుణ్ తివారీ, ప్ర‌ముఖ క్యాన్స‌ర్ రోబోటిక్ స‌ర్జ‌న్ డాక్ట‌ర్ చిన్న‌బాబు సుంక‌ప‌ల్లి క‌లుసుకున్నారు.

వీరితో పాటు రాష్ట్ర రోడ్లు భ‌వ‌నాల శాఖ మంత్రి కోమ‌టి రెడ్డి వెంక‌ట్ రెడ్డి, ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీ‌ధ‌ర్ బాబు కూడా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో గూగుల్ కంపెనీ పెట్టుబ‌డుల గురించి తోట చంద్ర‌శేఖ‌ర్ సీఎంతో చ‌ర్చించారు. కంపెనీ త‌న ప్రాజెక్టుల‌పై ప్ర‌భుత్వంతో క‌లిసి ప‌ని చేయాల‌ని కోరుకుంటున్న‌ట్లు తెలిపారు.

ఈ సంద‌ర్భంగా ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ గురంచి ప్ర‌తి రంగాన్ని ఎలా మారుస్తుందో రేవంత్ రెడ్డికి వివ‌రించారు. వ్య‌వ‌సాయం, విద్య‌, ఆరోగ్య రంగాల‌లో రాష్ట్రం కోసం డిజిట‌లైజేష‌న్ ఎజెండాను అభివృద్ది చేయ‌డంలో స‌ర్కార్ తో భాగ‌స్వామిగా ఉండేందుకు గూగుల్ సిద్దంగా ఉంద‌ని స్ప‌ష్టం చేశారు.

తెలంగాణ పౌరుల అవ‌స‌రాల‌ను తీర్చేందుకు, నాణ్య‌మైన సేవ‌ల‌ను అందించేందుకు కంపెనీ సాంకేతిక‌త‌, నైపుణ్యాన్ని క‌లిగి ఉంద‌ని చెప్పారు. ఇదిలా ఉండ‌గా రోడ్డు భ‌ద్ర‌తా చ‌ర్య‌లు, గూగుల్ మ్యాప్స్ , గూగుల్ ఎర్త్ ప్లాట్ ఫార‌మ్ ల వినియోగం గురించి చ‌ర్చించారు.