సీఎం రేవంత్ పై ఎమ్మెల్సీలు ఫిర్యాదు
కించ పరిచేలా మాట్లాడరని ఆరోపణ
హైదరాబాద్ – తెలంగాణ ప్రాంతానికి చెందిన శాసన మండలి సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు తమపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు శాసన మండలి గురించి చవకబారు విమర్శలు చేసిన రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని కలిసి లేఖ అందజేశారు.
శాసన మండలి గురించి అవాకులు చెవాకులు మాట్లాడటం మంచి పద్దతి కాదని, ఇది పూర్తిగా రాజ్యాంగ స్పూర్తికి భంగం కలిగించేలా ఉన్నాయని ఆరోపించారు. రాష్ట్రానికి బాధ్యత కలిగిన సీఎం పదవిలో ఉన్న రేవంత్ రెడ్డి మండలిని ఇరానీ కేఫ్ గా, ఎమ్మెల్సీలను రియల్ ఎస్టేట్ బ్రోకర్లు అంటూ నిందారోపణలు చేయడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు.
సీఎం వెంటనే బేషరతు క్షమాపణలు చెప్పాలని కోరారు. ఎథిక్స్ కమిటీ విచారణ చేపట్టాలని లేక పోతే తమ ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్బంగా లేఖ అందుకున్న శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి స్పందించారు.
ఎమ్మెల్సీలు చేసిన ఫిర్యాదు తనకు అందిందని, ఈ మేరకు ఎథిక్స్ కమిటీతో మాట్లాడతానని, ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చిందనే దానిపై వివరణ కోరుతామని హామీ ఇచ్చారు.