సీఎం సెక్యూరిటీలో కీలక మార్పులు
సంచలన నిర్ణయం తీసుకున్న సర్కార్
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీఎం ఎనుముల రేవంత్ రెడ్డికి సంబంధించిన భద్రత విషయంలో కీలక మార్పులు చేసింది. గతంలో మాజీ సీఎం కేసీఆర్ దగ్గర పని చేసిన పోలీస్ సెక్యూరిటీని మార్చాలని నిర్ణయించింది.
ఇదిలా ఉండగా సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించిన కదలికలు, వ్యక్తిగత సమాచారం అంతా బయటకు పొక్కుతోందని ఇంటెలిజెన్స్ నివేదించినట్లు సమాచారం. దీంతో ఉన్నట్టుండి ప్రస్తుతం ఉన్న వారిలో చాలా మందిని మార్చాలని ఆదేశించింది సర్కార్.
ఇప్పటికే సీఎంగా కొలువు తీరిన రేవంత్ రెడ్డి ఇటీవలే ఢిల్లీకి పలుమార్లు వెళ్లి వచ్చారు. అంతే కాకుండా దావోస్, లండన్ , దుబాయ్ లలో కూడా పర్యటించారు. ఇప్పటికే ఈ విషయం బయటకు పొక్కడంతో అంతా విస్తు పోయారు.
ఇదిలా ఉండగా గత కొన్ని రోజుల నుంచి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావులు పదే పదే ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ కూలి పోతుందని చెబుతుండడంతో రేవంత్ రెడ్డి సీరియస్ అయినట్లు టాక్. ముందస్తుగా మేల్కొన్న సీఎం వెంటనే తన వ్యక్తిగత భద్రతా సిబ్బందిని మార్చాలని ఆదేశించిడంతో ప్రభుత్వం ఈ కీలక మార్పు చేసింది.