సీతారామ ప్రాజెక్టులో భారీ స్కామ్
నిప్పులు చెరిగిన ఉత్తమ్ కుమార్ రెడ్డి
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్రంలోని ప్రాజెక్టులలో అంతులేని అవినీతి చోటు చేసుకుందని సంచలన ఆరోపణలు చేశారు భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో నీటి పారుదల రంగంపై సమీక్ష చేపట్టారు. త్వరలోనే ఈ ఏడాదికి సంబంధించి బడ్జెట్ ను తయారు చేసే పనిలో పడింది నూతన సర్కార్.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అవినీతి తారా స్థాయికి చేరిందని మండిపడ్డారు. ఎక్కడ చూసినా, ఏ శాఖను తట్టినా అంతటా అక్రమాలే కనిపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తం పాలనా వ్యవస్థను సర్వనాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఉత్తమ్ కుమార్ రెడ్డి.
తాజాగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. గత సర్కార్ చేపట్టిన సీతారామ ప్రాజెక్టులో భారీ ఎత్తున స్కామ్ చోటు చేసుకుందని ఆరోపించారు. స్వతంత్ర భారత దేశంలో ఇంత పెద్ద ఎత్తున కుంభకోణం తాను చూడలేదన్నారు. వేల కోట్ల ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారని వాపోయారు.
అసెంబ్లీ సాక్షిగా మాజీ సీఎం కేసీఆర్ అబద్దాలు చెప్పారని ఫైర్ అయ్యారు. 2014లో రూ. 1400 కోట్లు ఖర్చు చేస్తే ప్రాజెక్టు అయి పోయేదని కానీ 10 ఏళ్లయినా ఇంకా పూర్తి కాక పోవడం దారుణమన్నారు. దీనికి అదనంగా రూ.7,500 కోట్లు ఖర్చు చేశారంటూ సీరియస్ కామెంట్స్ చేశారు.
అది పూర్తయితే 3 లక్షల ఎకరాలకు పైగా ఆయకట్టు సాగయ్యేదన్నారు. కానీ ఇప్పటి వరకు ఒక్క ఎకరాకు నీళ్లు రాలేదన్నారు. సీతారామ ప్రాజెక్టుకు రూ. 18 వేల కోట్లు ఖర్చు చేశారని ఆరోపించారు.