అందరికీ ఆహ్వానం అభివృద్దికి సోపానం
విదేశీ ప్రతినిధుల సమావేశంలో సీఎం
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లో కొత్త సర్కార్ కొలువు తీరింది. దీంతో ఆయా దేశాలకు సంబంధించిన ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ కీలక భేటీలో 15 దేశాలకు చెందిన అంబాసిడర్లు హాజరయ్యారు. వీరితో పాటు మంత్రులు భట్టి, దామోదర రాజ నరసింహ, దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఉన్నారు.
ఈ సందర్భంగా విదేశీ ప్రతినిధులను ఉద్దేశించి కీలక ప్రసంగం చేశారు రేవంత్ రెడ్డి. తమ ప్రభుత్వం పూర్తి పారదర్శకతతో ఉందన్నారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు, ఔత్సాహికులు ఎవరైనా సరే రాష్ట్రానికి రావచ్చని స్పష్టం చేశారు.
ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న దుష్ప్రచారం నమ్మ వద్దని కోరారు. తమది ఫ్రెండ్లీ ప్రభుత్వమని స్పష్టం చేశారు. విదేశాలలో ఉన్న వ్యాపారవేత్తలు ఎవరైనా సరే, కార్పొరేట్ కంపెనీలకు కూడా సాదర స్వాగతం పలుకుతున్నామని చెప్పారు రేవంత్ రెడ్డి.
ఈ ఏడాది 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల కల్పనకు శ్రీకారం చుట్టామని తెలిపారు. ఆరు గ్యారెంటీల పేరుతో ముందుకు వచ్చామని , వాటిని కూడా అమలు చేసి తీరుతామని చెప్పారు. రాబోయే రోజుల్లో పాలన మరింత అర్థవంతంగా ఉంటుందన్నారు సీఎం. ఎప్పుడైనా తనను వచ్చి కలవవచ్చని సూచించారు.