అధికారంలోకి వస్తే అభివృద్ది చూపిస్తా
టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు
అమరావతి – ఏపీలో రాజకీయాలు మరింత జోరందుకున్నాయి. త్వరలోనే శాసన సభ , లోక్ సభ ఎన్నికలకు సిద్దమైంది రాష్ట్రం. దీంతో ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న వైసీపీని టార్గెట్ చేశాయి. ఇక ఈసారి టీడీపీ, జనసేన కలిసి బరిలోకి దిగనున్నాయి. ఇంకా సీట్ల పంచాయతీ కొలిక్కి రాక పోయినా ముందుకే వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్.
ఈ సందర్బంగా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడినా తాము చెప్పిన మాటకు కట్టుబడి ఉంటామని అన్నారు. ఇప్పటికే అమరావతినే ఏపీకి రాజధాని అని మరోసారి స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు.
మూడు రాజధానులు అన్నది ఉట్టి మాట అని, పరిపాలనా పరమైన అనుభవం జగన్ మోహన్ రెడ్డికి లేకుండా పోయిందన్నారు. అలా ఉంటే ఇలాంటి చెత్త నిర్ణయం తీసుకుని ఉండే వారు కాదన్నారు. అయినా ప్రజలు అన్నింటికీ సిద్దపడే ఉన్నారని అన్నారు.
ఇవాళ అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిన ఘనత జగన్ రెడ్డికే దక్కుతుందన్నారు. ఐటీని తీసుకు వచ్చిందే తాననని అన్నారు. ఎన్నో ఏళ్ల కింద తాను స్థాపించిన ఐటీ ఇవాళ ప్రవర్దమానమై వెలుగుతోందన్నారు. వేలాది మందికి ఉపాధి కల్పించిన ఘనత తనదేనని పేర్కొన్నారు.