అప్పుల భారం మోపింది చంద్రబాబే
నిప్పులు చెరిగిన ఆర్థిక మంత్రి బుగ్గన
అమరావతి – తమపై అసత్య ఆరోపణలు చేయడం మానుకోవాలని హితవు పలికారు ఏపీ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి. తాము ఎందుకు అప్పులు తీసుకు వచ్చామనేది బహిరంగంగానే ఉందన్నారు. గతంలో ఏపీని ఏలిన చంద్రబాబు నాయుడు చేసిన నిర్వాకం కారణంగానే అప్పులు పెరిగి పోయాయని, వాటికి వడ్డీలు కట్టలేక తాము ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు.
వెలగపూడి సచివాలయంలో బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. అప్పులపై టీడీపీ, జనసేన, బీజేపీ అసత్య ప్రచారం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. టీడీపీతో పోలిస్తే వైసీపీ చేసిన అప్పులు చాలా తక్కువేనని పేర్కొన్నారు. చంద్రబాబు మాయ మాటలు చెప్పడంలో రాటు దేలాడని, ఆయన చేసింది ఏమీ లేదని ఎద్దేవా చేశారు.
ప్రధానంగా ఒక మీడియా తప్పుడు వార్తలు ప్రచురిస్తూ, ప్రసారం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇవాళ దేశంలోనే ఎక్కడా లేని రీతిలో విద్యా, వైద్య రంగాలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది ఏపీనేనని తెలుసు కోవాలన్నారు.
తాము రూ. 13 లక్షల కోట్ల అప్పులు ఎక్కడి నుంచి తెచ్చామో చంద్రబాబు నాయుడు చెప్పాలని డిమాండ్ చేశారు. నిరాధారమైన ఆరోపణలు చేయడం, ఆ తర్వాత మౌనంగా ఉండడం ఆయనకు అలవాటుగా మారిందన్నారు బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆర్థిక శాఖ, బ్యాంకులకు తెలియకుండా అప్పులు ఎలా చేస్తారని ప్రశ్నించారు. ఈ మాత్రం ఇంకిత జ్ఞానం ఉండక పోతే ఎలా అన్నారు. ఏపీ సర్కార్ మొత్తం అప్పు రూ. 4,28,715 కోట్లు అని స్పష్టం చేశారు ఏపీ మంత్రి.