అభిమానులు నాకు తల్లిదండ్రులు
ప్రిన్స్ మహేష్ బాబు కామెంట్స్
గుంటూరు – ప్రముఖ నటుడు ప్రిన్స్ మహేష్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన గుంటూరు కారం ప్రీ రిలీజ్ వేడుకలు గుంటూరులో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా మహేష్ బాబు భావోద్వేగానికి లోనయ్యారు. తన సినిమా విడుదలైనప్పుడు తన తండ్రి దివంగత నటశేఖర కృష్ణ అభిప్రాయం చెప్పే వారని, కానీ ఇప్పుడు భౌతికంగా లేరని వాపోయాడు.
తన తల్లి కూడా తన మధ్య లేదని ఇక మిగిలింది అశేషమైన అభిమానులైన మీరేనని కొనియాడారు. జీవితాంతం తాను రుణపడి ఉంటానని అన్నారు. మీరు లేకపోతే తాను లేనన్నారు. తనకు అత్యంత ఆత్మీయుడు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అని ప్రశంసలతో ముంచెత్తారు.
తాను సినీ రంగంలోకి వచ్చి 25 ఏళ్లు అయ్యిందన్న విషయం డైరెక్టర్ చెబితే కానీ తెలియదన్నారు. చూస్తూ ఉండగానే కాలం వెళ్లి పోతోందని, రోజు రోజుకు కొత్తగా ఉందన్నారు. తొలిసారిగా త్రివిక్రమ్ తో అతడు చిత్రంలో నటించానని అది తన కెరీర్ ను పూర్తిగా మార్చేసిందన్నారు. ఇదే సమయంలో ఖలేజా లో నటించానని అది కూడా బాగా ఆడిందన్నారు. ప్రస్తుతం ముచ్చటగా మూడో సినిమా గుంటూరు కారం చేశానని చెప్పారు.
సంక్రాంతి పండుగ తనకు సెంటిమెంట్ అని తప్పకుండా బ్లాక్ బస్టర్ అవుతుందన్న నమ్మకం తనకు ఉందన్నారు మహేష్ బాబు.