అభివృద్దికి చిరునామా ఏపీ నమూనా
ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి
నంద్యాల జిల్లా – ఏపీ ప్రభుత్వ నమూనా అభివృద్దికి చిరునామాగా మారి పోయిందన్నారు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి. నంద్యాల జిల్లా డోన్ లో పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించారు. ఐటీఐ కళాశాల ఆవరణలో రూ.11 కోట్లతో నిర్మించిన హాస్టల్ భవనాన్ని ప్రారంభించారు.
అత్యాధునిక సదుపాయాలతో ఆధునికీక రించనున్నట్లు మంత్రి ప్రకటించారు. వాటర్ గ్రిడ్ ప్రాజెక్టులో భాగంగా గోరుకల్లు రిజర్వాయర్ నుంచి పైప్ లైన్ ద్వారా నీటిని రప్పించి బుగ్గానిపల్లెలోని ప్లాంట్ లో శుభ్రపరచి 29న బేతంచెర్లకు తాగునీరు అందించనున్నట్లు మంత్రి బుగ్గన స్పష్టం చేశారు.
నాలుగేళ్ల క్రితం వరకూ కెనాళ్లు, జల వనరుల ప్రాజెక్టులు, సాగు నీరు లేని ప్రాంతం ఉమ్మడి కర్నూలు జిల్లాలో డోన్ ఒక్కటేనని బుగ్గన రాజేంద్రనాథ్ వెల్లడించారు. కానీ.. ఇప్పుడు రూ.224 కోట్ల ఖర్చుతో హంద్రీ నీవా సుజల స్రవంతి ప్రాజెక్టును పూర్తి చేశామన్నారు.
డోన్ నియోజకవర్గంలో 36 చెరువులు నింపి 10 వేల ఎకరాలకు సాగు నీటిని అందించడం జరిగిందన్నారు.
బేతంచెర్ల, డోన్, ప్యాపిలిలో చిన్నారులు విద్యలో రాణించాలని నియోజక వర్గ వ్యాప్తంగా రూ.100 కోట్ల పైన ఖర్చుపెట్టి స్కూళ్లు, కాలేజీలు నిర్మించినట్లు మంత్రి స్పష్టం చేశారు.
విద్యకు ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలను పారదర్శకంగా అమలు చేస్తోందన్నారు. అమ్మఒడి, విదేశీ విద్యా దీవెన, గోరుముద్ద, ఫీజు రీయింబర్స్ మెంట్, విద్యా కానుక పథకాలే అందుకు నిదర్శనమన్నారు.
చదువంటే ఇంజనీరింగ్ మాత్రమే కాదు..అత్యున్నత ఉపాధి అవకాశాలు కల్పించే కోర్సులు ఎన్నో ఉన్నాయని బుగ్గన రాజేంద్రనాథ్ చెప్పారు. మరో 3 నెలల్లో డోన్ ప్రభుత్వ ఐటీఐ కాలేజీలో విశ్వ విద్యాలయం స్థాయి వనరులను ఏర్పాటు చేస్తామన్నారు.
11 ఎకరాల విస్తీర్ణంలో వెంకటాపురం రోడ్డులోని పేరంటాలమ్మ గుడి దగ్గర కేంద్రీయ విశ్వ విద్యాలయం ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి బుగ్గన తెలిపారు.