ఆ పార్టీలను తరిమి కొట్టండి
జేడీ లక్ష్మి నారాయణ కామెంట్
అమరావతి – జై భారత్ చీఫ్, మాజీ సీబీఐ డైరెక్టర్ జేడీ లక్ష్మీ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన కేంద్రంలో కొలువు తీరిన భారతీయ జనతా పార్టీ సర్కార్ పై మండిపడ్డారు. ఏపీలో బీజేపీ కంటే నోటాకు ఎక్కువ ఓట్లు వచ్చాయని అన్నారు.
రాష్ట్రంలో బీజేపీకి మద్దతు ఇస్తున్న పార్టీలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి తరిమి కొట్టాలని జేడీ పిలుపునిచ్చారు. మాజీ ఎంపీ వడ్డే శోభనాద్రీశ్వర్ రావు ఆధ్వర్యంలో మోడీ బచావో దేశ్ బచావో సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జేడీ లక్ష్మీ నారాయణ హాజరయ్యారు.
రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని, ఇప్పటి వరకు మొత్తం అసలు, వడ్డీతో కలుపుకుంటే ఏకంగా రూ. 10, 00,000 కోట్ల అప్పు మిగిలి ఉందన్నారు. ఒక్కో వ్యక్తిపై కనీసం 2 లక్షలకు పైగా అప్పు భారం ఉందన్నారు. ప్రతి పార్టీ రాష్ట్రాన్ని ఉద్దరిస్తామని అంటోందని, కానీ వాళ్లను వాళ్లు బాగు పర్చు కోవడం పైనే ఎక్కువగా దృష్టి సారించారని మండిపడ్డారు.
ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు విలువైనదేనని, దానిని జాగ్రత్తగా వాడుకోవాలని సూచించారు. ప్రలోభాలకు లొంగి పోతే ప్రజాస్వామ్యంకు విలువ ఏముందని ప్రశ్నించారు. ఇకనైనా ప్రజలు విజ్ఞతతో ఆలోచించాలని, పని చేసే వారికి పట్టం కట్టాలని పిలుపునిచ్చారు జేడీ లక్ష్మీ నారాయణ.