ఉచితాలకు తావు లేదు – జేడీ
త్వరలో జై భారత్ మేనిఫెస్టో
అమరావతి – సీబీఐ మాజీ డైరెక్టర్, జై భారత్ పార్టీ చీఫ్ జేడీ లక్ష్మీ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. అన్ని పార్టీల కంటే భిన్నంగా తమ పార్టీకి చెందిన మేనిఫెస్టో ఉంటుందన్నారు. ఇందులో ప్రజలకు పెద్దపీట వేస్తామని చెప్పారు.
నవరత్నాలతో జగన్ మోహన్ రెడ్డి జనాన్ని మోసం చేశాడని, ఆయన కంటే ఎక్కువగా సంక్షేమ పథకాలు తీసుకు వస్తామని జనం చెవుల్లో టీడీపీ, జనసేన పార్టీలు పూలు పెట్టాయని ఆరోపించారు. ఎన్నికలు వస్తున్నాయంటే చాలు హామీల వర్షం కురిపిస్తారని ఎద్దేవా చేశారు.
సంక్షేమం పేరుతో రాజకీయాలు చేయడం మానుకోవాలని సూచించారు జేడీ లక్ష్మీ నారాయణ. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో స్వచ్చందంగా విలువైన ఓటును వినియోగించుకునేలా తమ పార్టీ ప్రయత్నం చేస్తుందన్నారు. ప్రజలను చైతన్యవంతం చేసేందుకు కృషి చేస్తామని చెప్పారు.
జై భారత్ పార్టీ తయారు చేసే మేనిఫెస్టో అన్ని వర్గాలకు ఆమోద యోగ్యంగా ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరికీ విద్య, వైద్యం, ఉపాధి అన్నది తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ఇందులో అభివృద్దికి తావు ఉంటుందని, కానీ ఉచితాలకు స్థానం ఉండదని కుండ బద్దలు కొట్టారు.