ఉన్నోళ్లకు రైతు బంధు వద్దు
ఆకునూరి మురళి కామెంట్స్
హైదరాబాద్ – సోషల్ డెమోక్రటిక్ ఫోరం (ఎస్డీఎఫ్) కన్వీనర్, మాజీ ఐఏఎస్ ఆఫీసర్ ఆకునూరి మురళి షాకింగ్ కామెంట్స్ చేశారు. సోమవారం ఆయన ట్విట్టర్ వేదికగా ఏకి పారేశారు. దళిత బంధు, రైతు బంధు పేరుతో గత ప్రభుత్వం అడ్డగోలుగా ఉన్నోళ్లకు, ధనవంతులకు, సాగు చేయని వారికి డబ్బులు ఖాతాల్లో వేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.
తాజాగా కొలువు తీరిన కాంగ్రెస్ సర్కార్ ఇలాంటి పనులకు స్వస్తి పలకాలని పిలుపునిచ్చారు. ఆదాయపు పన్ను కట్టే వారికి రైతు బంధు ఇవ్వ కూడదని కోరారు. అంతే కాకుండా సినిమా రంగానికి చెందిన హీరో హీరోయిన్లు, నిర్మాతలు, దర్శకులు, కంపెనీల యజమానులు, బడా ఉద్యోగులు, పారిశ్రామికవేత్తలు, ఫార్మ్ హౌస్ యజమానులకు వెంటనే రైతు బంధు నిలిపి వేయాలని స్పష్టం చేశారు.
అంతే కాకుండా విదేశాలలో ఉద్యోగాలు చేసే వాళ్లు, స్థిర పడిన వాళ్లు, ప్రవాస భారతీయులకు రైతు బంధు ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించారు. అయితే గల్ఫ్ దేశాలలో చిన్న జీతాలతో పని చేసే వారిని మినహాయించాలని కోరారు. పంట పండించని భూమి యజమానులకు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు.
ఏడున్నర ఎకరాలకు మించి ఉన్న రైతులకు రైతు బంధు ఇవ్వొద్దని సూచించారు ఆకునూరి మురళి.