NATIONALNEWS

ఉప ఎన్నిక‌ల్లో ఇండియా కూట‌మి జోరు

Share it with your family & friends

భార‌తీయ జ‌న‌తా పార్టీ బేజారు

న్యూఢిల్లీ – దేశంలోని 7 రాష్ట్రాల‌లో జ‌రిగిన ఉప ఎన్నిక‌ల ఫ‌లితాల‌లో ప్ర‌తిప‌క్షాల‌తో కూడిన భార‌త కూట‌మి అభ్య‌ర్థులు గ్రాండ్ విక్ట‌రీ న‌మోదు చేశారు. మొత్తం 13 స్థానాల‌కు బై పోల్ జ‌రిగింది. ఇందులో 11 స్థానాల‌లో ఇండియా కూట‌మి జ‌య కేత‌నం ఎగుర వేసింది. కేంద్రంలో కొలువు తీరిన భార‌తీయ జ‌న‌తా పార్టీ కేవ‌లం ఒకే ఒక్క స్థానానికి ప‌రిమిత‌మైంది. ఇక మిగ‌తా ఒక స్థానంలో స్వతంత్ర అభ్య‌ర్థి గెలుపొంద‌డం విశేషం.

ఇదిలా ఉండ‌గా తాజాగా జ‌రిగిన లోక్ స‌భ ఎన్నిక‌ల్లో ఇండియా కూట‌మి గ‌ట్టి పోటీ ఇచ్చింది. తాజాగా ఏడు రాష్ట్రాల‌కు సంబంధించి 13 శాస‌న స‌భ స్థానాల‌కు ఉప ఎన్నిక‌లు జ‌రిగాయి. పంజాబ్ , హిమాచ‌ల్ ప్ర‌దేశ్ , ఉత్త‌రాఖండ్ , ప‌శ్చిమ బెంగాల్ , మ‌ధ్య ప్ర‌దేశ్, బీహార్, త‌మిళ‌నాడులలో జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ , టీఎంసీ, ఆప్ , డీఎంకే అభ్య‌ర్థులు విజ‌యం సాధించారు.

పంజాబ్‌లోని జలంధర్ వెస్ట్‌లో ఆప్‌కి చెందిన మొహిందర్ భగత్ 23,000 ఓట్లతో విజయం సాధించారు. పశ్చిమ బెంగాల్‌లో, తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థులు నాలుగు స్థానాల్లో గెలుపొందారు.

హిమాచల్ ప్ర‌దేశ్ ముఖ్యమంత్రి సుఖ్‌విందర్‌ సింగ్‌ సుఖు భార్య కమలేష్‌ ఠాకూర్‌ తొలిసారిగా డెహ్రా ఎన్నికల్లో విజయం సాధించగా.. రాష్ట్రంలోని నలాగఢ్‌లోనూ జ‌య కేత‌నం ఎగుర వేసింది . ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్, మంగళూర్ రెండు స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపు బాట ప‌ట్టారు. .

ఇక మధ్యప్రదేశ్‌లోని అమర్వార్ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి ధీరన్ షా ఇన్వతి 4,000 ఓట్ల ఆధిక్యం సాధించారు. బీహార్‌లో జేడీ(యూ)కి చెందిన కళాధర్ ప్రసాద్ మండల్ రూపాలీలో గెలుపొందారు. తమిళనాడులోని విక్రవాండి అసెంబ్లీ స్థానంలో డీఎంకే అభ్యర్థి అన్నియూర్ శివ 10,000 ఓట్లకు పైగా ఆధిక్యంలో ఉన్నారు.