కేటీఆర్ పై నిర్మాత బండ్ల గణేష్ కామెంట్
హైదరాబాద్ – కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి కేటీఆర్ పై భగ్గుమన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. పదే పదే తమ సర్కార్ పై లేనిపోని ఆరోపణలు చేయడం మానుకోవాలని హితవు పలికారు.
తాము పవర్ లోకి వచ్చి కేవలం 40 రోజులు మాత్రమే అయ్యాయని అప్పుడే విమర్శలు ఎక్కు పెట్టడం మంచి పద్దతి కాదని సూచించారు. ప్రజాస్వామ్యంలో ఎమ్మెల్యేలు సీఎంను కలవడం పరిపాటి అని పేర్కొన్నారు. దీనిలో తప్పు ఏముందంటూ ప్రశ్నించారు.
ఆ మాత్రం తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కలిసినంత మాత్రాన ఎలా చేరుతారని అనుకుంటున్నారో కేటీఆర్ కే తెలియాలని ఎద్దేవా చేశారు బండ్ల గణేశ్. పవర్ పోయిన బాధలో ఉన్నారని, అందుకే అవాకులు చెవాకులు పేలుతున్నారంటూ మండిపడ్డారు.
కేటీఆర్ ఎందుకు ఉలికి పాటుకు గురవుతున్నారో తనకు అర్థం కావడం లేదన్నారు . ఇకనైనా తమ పార్టీని పడగొట్టే ఆలోచనలకు స్వస్తి పలికి, ముందు మీ పార్టీని కాపాడుకునేందుకు ప్రయత్నం చేయాలని అన్నారు సినీ నటుడు, నిర్మాత.