అభినందించిన మంత్రి కొల్లు రవీంద్ర
అమరావతి – ఏపీ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా విజయానంద్ ను నియమించారు. ప్రస్తుత సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ పదవీ కాలం ఈనెలాఖరుతో ముగియనుంది. విజయానంద్ ప్రస్తుతం ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. 1992 బ్యాచ్ కు చెందిన ఆయన ఎన్నో పదవులు నిర్వహించారు.
పలు జిల్లాలకు కలెక్టర్ గా , జెన్ కోకు ఎండీగా, ప్రధాన ఎన్నికల అధికారిగా పని చేశారు.
ఇదిలా ఉండగా సీఎస్ గా బీసీని నియమించడం పట్ల సీఎం చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలిపారు మంత్రి కొల్లు రవీంద్ర. రాష్ట్ర పాలనా యంత్రాంగంలో అత్యంత కీలక స్థానంలో బీసీ వ్యక్తిని నియమించడం బీసీల పట్ల సీఎంకు ఉన్న నిబద్దతకు నిదర్శనమన్నారు.
బలహీన వర్గాలను బలమైన వర్గంగా గుర్తించే ఏకైక నాయకుడు చంద్రబాబేనని మరోసారి నిరూపించుకున్నారని ప్రశంసించారు. బీసీ నాయకులకు, అధికారులకు ఎప్పుడూ సమున్నత గౌరవం కల్పించడంలో తనకు తానే సాటి అన్నారు.
ఆంధ్రప్రదేశ్ చరిత్రలో తొలిసారి బీసీ వ్యక్తిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించడం సంతోషంగా ఉందన్నారు కొల్లు రవీంద్ర. డీజీపీగా బీసీ, పార్టీ అధ్యక్ష బాధ్యతలు బీసీ నాయకుడికి ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు.