ప్రజలు కానే కాదన్న మాజీ మంత్రి
హైదరాబాద్ – పార్టీ ఓటమికి ప్రధాన కారణం ప్రజలు కాదని మనమేనని అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పార్లమెంటరీ సమీక్షా సమావేశాల అనంతరం శుక్రవారం కేటీఆర్ జాబితా చేసిన అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయానికి గల కారణాలను ఏకరువు పెట్టారు.
ఇప్పటి దాకా 10 పార్లమెంటరీ నియోజకవర్గాలను సమీక్షించారు. ఈ సందర్బంగా ఎందుకు ఓడి పోయామనే దాని గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. పరిపాలనపై దృష్టి సారించామే తప్పా పార్టీ గురించి పట్టించు కోలేదన్నారు. పార్టీలో సంస్థాగత నిర్మాణం సరిగ్గా జరగలేదన్నారు కేటీఆర్.
అంతే కాకుండా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి సరైన గుర్తింపు ఇవ్వలేక పోయామని తెలిపారు. దీనికి పూర్తి బాధ్యత నాదేనని స్పష్టం చేశారు. పార్టీని ఎమ్మెల్యే కేంద్రంగా నడపడం సరి కాదని గుర్తించామని చెప్పారు. ఈ దశాబ్ద కాలంలో పార్టీ కోసం పని చేస్తున్న క్యాడర్ ఆర్థిక పరిస్థితి గురించి పట్టించు కోలేదన్నారు.
ప్రభుత్వ పథకాలు మధ్యవర్తి లేకుండా నేరుగా లబ్దిదారులకు అందజేయడం వల్ల ఓటర్లు, కార్యకర్తల మధ్య బంధం తెగి పోయిందన్నారు. 6 లక్షల కంటే ఎక్కువగా రేషన్ కార్డులు ఇచ్చామని కానీ దానిని సరిగా ప్రొజెక్టు చేయలేక పోయామని ఆవేదన చెందారు కేటీఆర్.
ప్రతి నియోజకవర్గంలో 15 వేల మందికి పైగా కొత్త పెన్షన్లు ఇచ్చామని, రైతు బంధు తీసుకున్న రైతులలో భూస్వాములకు ఇవ్వడాన్ని జీర్ణించు కోలేక పోయారని ఇదే పెద్ద దెబ్బ కొట్టిందన్నారు. ప్రతికూల ప్రభావాలను పసిగట్ట లేక పోయామని స్పష్టం చేశారు .