టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు
విజయవాడ – రాష్ట్రంలో ఇప్పటికే సవరించిన ఓటరు జాబితాలో అవకతవకలు చోటు చేసుకున్నాయని సంచలన ఆరోపణలు చేశారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. గతంలో ఎన్నడూ లేని రీతిలో అరాచకాలు చోటు చేసుకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
మంగళవారం ఏపీలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి కేంద్ర ఎన్నికల కమిషనర్ ఆధ్వర్యంలోని బృందం వివిధ రాజకీయ పార్టీల చీఫ్ లతో సమావేశమైంది. ఈ సందర్బంగా టీడీపీ చీఫ్ తో పాటు జనసేన పార్టీ అధిపతి పవన్ కళ్యాణ్ హాజరయ్యారు.
ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేసే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే స్థాయికి దిగజారిందని పేర్కొన్నారు.
ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. పార్టీల నేతలు, కార్యకర్తలపై అక్రమంగా కేసులు నమోదు చేశారని ఆరోపించారు. ప్రజల్లో తిరుగుబాటు చూసి నకిలీ ఓట్లు చేర్చేందుకు వైసీపీ ప్రయత్నం చేస్తోందని ధ్వజమెత్తారు నారా చంద్రబాబు నాయుడు.
ఎన్నికల విధుల్లో తటస్థులను నియమించాలని డిమాండ్ చేశారు. బీఎల్ ఓలుగా 2000 మంది మహిళా పోలీసులను పెట్టారని, తమపై , జనసేనపై 6 వేల నుంచి 7 వేల కేసులు అక్రమంగా పెట్టారని వాపోయారు. పుంగనూరు కేసులో 200 మందికి పైగా జైలుకు వెళ్లి వచ్చారని అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న తతంగాన్ని సీఈసీకి వివరించామని తెలిపారు.