కాంగ్రెస్ కు షాక్ మాజీ సీఎం జంప్
బీజేపీలో తిరిగి చేరిన జగదీష్ షెట్టర్
న్యూఢిల్లీ – కన్నడ నాట కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని షాక్ తగిలింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ నుంచి కాంగ్రెస్ లో చేరిన మాజీ సీఎం జగదీష్ షెట్టర్ ఉన్నట్టుండి ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. గురువారం ఆయన పార్టీ చీఫ్ జేపీ నడ్డా, మాజీ సీఎం బీఎస్ యెడ్యూరప్ప సారథ్యంలో కాషాయ కండువా కప్పుకున్నారు. ఇదిలా ఉండగా కర్ణాటకలో జరిగిన శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల విజయం కోసం కృషి చేశారు.
రాష్ట్రంలో లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన వారు జగదీష్ షట్టర్. గత ఏడాది ఏప్రిల్ లో టికెట్ నిరాకరించడంతో బీజేపీని వీడారు. హస్తం గూటికి చేరారు. హుబ్లీ – ధార్వాడ్ సెంట్రల్ అసెంబ్లీ నుండి పోటీ చేసేందుకు టికెట్ ఇచ్చారు. అయితే బీజేపీ అభ్యర్థి మహేష్ చేతిలో ఓటమి పాలయ్యారు.
అయితే జగదీశ్ షెట్టర్ మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. పార్టీలో సీనియర్ నాయకుడు. ఆయన తిరిగి పార్టీలో చేరేందుకు వ్యూహం పన్నారు మాజీ సీఎం బీఎస్ యెడ్యూరప్ప, ఆయన తనయుడు బీవై విజయేంద్ర.
ఈ సందర్బగా శెట్టర్ మీడియాతో మాట్లాడారు. గతంలో పార్టీ తనకు కొన్ని బాధ్యతలు అప్పగించిందని, కొన్ని సమస్యల కారణంగా తాను పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరాల్సి వచ్చిందన్నారు. తొమ్మిది నెలలుగా చర్చలు జరిగాయి. నేతలు, కార్యకర్తలు తనపై ఒత్తిడి చేశారని, దీంతో తట్టుకోలేక కాషాయ కండువా కప్పున్నానని చెప్పారు.