కాంగ్రెస్ పార్టీకి రూ. 2 కోట్ల విరాళం
సచిన్ పైల్ ఆధ్వర్యంలో అందజేత
రాజస్థాన్ – దేశంలో సార్వత్రిక ఎన్నికలు రానున్నాయి. దీంతో ఇప్పటి నుంచే అన్ని పార్టీలు ప్రచారంపై దృష్టి సారించాయి. ఈసారి ఎలాగైనా సరే అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తోంది. ఈ మేరకు అన్ని ప్రతిపక్ష పార్టీలతో కలిసి ఇండియా కూటమిగా ఏర్పడ్డాయి. లోక్ సభ ఎన్నికల్లో కలిసికట్టుగా పోటీ చేయాలని నిర్ణయించాయి. ఈ మేరకు పలుమార్లు భేటీ అయ్యాయి.
అయితే తాజాగా జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాజస్థాన్, చత్తీస్ గఢ్ రాష్ట్రాలను కోల్పోయింది. అనూహ్యంగా భారతీయ జనతా పార్టీ పవర్ లోకి వచ్చింది. ఇదే సమయంలో కేసీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్ సర్కార్ కు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఇక్కడ రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.
ఇక పార్టీకి సంబంధించి మరింత బలోపేతం చేసేందుకు గాను విరాళాల సేకరణకు శ్రీకారం చుట్టింది ఏఐసీసీ. ఇందులో భాగంగా పార్టీ పిలుపును అందుకున్న నేతలు, కార్యకర్తలు తమకు తోచిన రీతిలో విరాళాలను అందజేస్తున్నారు. తాజాగా రాజస్థాన్ మాజీ డిప్యూటీ సీఎం , సీనియర్ నేత సచిన్ పైలట్ ఆధ్వర్యంలో పార్టీ కోసం రూ. 2 కోట్లను విరాళంగా అందజేశారు.