కాంగ్రెస్ బూత్ స్థాయి సమావేశం
హాజరు కానున్న ఏఐసీసీ చీఫ్ ఖర్గే
హైదరాబాద్ – త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. దీంతో తెలంగాణలో కొత్తగా కొలువు తీరిన కాంగ్రెస్ ప్రభుత్వం ఫుల్ జోష్ లో కొనసాగుతోంది. సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇందులో భాగంగా కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు పార్టీని బలోపేతం చేయడంపై ఫోకస్ పెట్టారు. ఎలాగైనా 17 ఎంపీ స్థానాలు గెలవాలని కంకణం కట్టుకున్నారు.
ఇందులో భాగంగా జనవరి 25న గురువారం హైదరాబాద్ లోని లాల్ బహదూర్ స్టేడియంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన బూత్ స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే హాజరవుతారని టీపీసీసీ వెల్లడించింది.
ఇదిలా ఉండగా కార్యక్రమ ఏర్పాట్లపై వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ తో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. పలు సూచనలు చేశారు.
మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా పార్టీ ఏజెంట్లతో సమావేశం ఉంటుందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బూత్ లెవల్లో వీరు కీలకంగా పని చేశారని కితాబు ఇచ్చారు. పార్టీని గెలిపించడంలో చిరస్మరణీయమైన పాత్ర ఉందన్నారు.