కాంగ్రెస్ సర్కార్ బేకార్ – కేటీఆర్
రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగిన మాజీ మంత్రి
హైదరాబాద్ – ఆచరణకు నోచుకోని ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను నిలువునా మోసం చేసిందని ఆరోపించారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మహబూబాబ్ పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహక సమావేశానికి ఆయన హాజరై ప్రసంగించారు. ప్రజలు మనకు పదేళ్లు ఛాన్స్ ఇచ్చారని , కానీ ఓడి పోతామని అనుకోలేదన్నారు.
కాంగ్రెస్ కేవలం మాయ మాటలు చెప్పింది..ఓట్లు దండుకుందంటూ ఆరోపించారు కేటీఆర్. 420 హామీలు ఇచ్చిందంటూ ధ్వజమెత్తారు. వాళ్ల తప్పుడు ప్రచారం నమ్మి అద్భుతంగా పని చేసిన మనల్ని నమ్మక పోవడం తనను బాధకు గురి చేసిందన్నారు వర్కింగ్ ప్రెసిడెంట్.
రేషన్ కార్డులు ఇవ్వలేదని చేసిన ప్రచారం పూర్తిగా అబద్దమన్నారు. 6,47,479 రేషన్ కార్డులను ఇవ్వడం జరిగిందన్నారు కేటీఆర్. దేశంలో అత్యధికంగా ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించిన ఘనత తమదేనని అన్నారు.
అంతే కాదు ప్రభుత్వ ఉద్యోగులకు అత్యధికంగా వేతనాలు ఇచ్చిన ఘనత బీఆర్ఎస్ సర్కార్ కే దక్కతుందని, కానీ దానిని మనం గొప్పగా ప్రచారం చేసుకోలేక పోయామని స్పష్టం చేశారు. ఇకనైనా రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో మనం చేసిన పనులను ప్రజలకు చెప్పాలని సూచించారు కేటీఆర్.