పిలుపునిచ్చిన నాగబాబు
అమరావతి – ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాపులంతా కలిసికట్టుగా టీడీపీ, జనసేన కూటమికి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు జనసేన పార్టీ అగ్ర నాయకుడు , సినీ నటుడు నాగేంద్ర బాబు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నరసారావుపేటలో కాపు నేతలతో ప్రత్యేక సమావేశం అయ్యారు.
వచ్చే ఎన్నికల్లో కాపులంతా జనసేన పార్టీకి సంపూర్ణ మద్దతు ఇవ్వాలని కోరారు. జన సేనకు పట్టు ఉన్న నియోజకవర్గాలలో టికెట్లు తీసుకోవాలని, గెలుపే లక్ష్యంగా పని చేయాలని సూచించారు. పొత్తులో భాగంగా టికెట్లు కచ్చితంగా వస్తాయన్నారు. ఇదే సమయంలో మనందరం ఫోకస్ పెడితే కచ్చితంగా గెలుస్తామన్నారు.
దీంతో పవర్ షేరింగ్ చేసుకోవచ్చని తెలిపారు నాగబాబు. ఈసారి రాష్ట్రంలో టీడీపీ, జనసేన కూటమి విజయం సాధించడం ఖాయమని జోష్యం చెప్పారు. తమ పార్టీ అగ్ర నేత ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారని , రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తారని అన్నారు.
త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్ రాబోతోందని, ప్రతి ఒక్కరు ఈ విలువైన సమయాన్ని వృధా చేయకుండా పార్టీ కోసం పని చేయాలని సూచించారు నాగ బాబు.