EDITOR'S CHOICE

కాళేశ్వ‌రం బ‌య‌ట ప‌డిన బండారం

Share it with your family & friends

కాగ్ నివేదిక‌లో బైర్లు క‌మ్మే వాస్త‌వాలు

అధికారం చేతుల్లో ఉంటే చాలు అప్ప‌నంగా ప్ర‌జా ధ‌నం దోచుకోవ‌చ్చ‌ని, త‌మ వారికి అప్ప‌గించ వ‌చ్చ‌ని కేసీఆర్ సార‌థ్యంలోని భార‌త రాష్ట్ర స‌మితిని చూస్తే తెలుస్తుంది. తెలంగాణ పేరుతో సాగించిన దోపిడీకి ప‌ర‌కాష్ట కాళేశ్వ‌రం ప్రాజెక్టు. ఇందుకు సంబంధించి పెద్ద ఎత్తున ఆరోప‌ణ‌లు, విమ‌ర్శ‌లు వ‌చ్చినా వాటిని డోంట్ కేర్ అంటూ కొట్టి పారేశారు. స‌రిగ్గా అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందు కాళేశ్వ‌రం ప్రాజెక్టు ప‌రిధిలోని మేడిగ‌డ్డ బ్యారేజ్ పిల్ల‌ర్లు కుంగి పోయాయి. ల‌క్షా 20 వేల కోట్ల‌కు పైగా అడ్డ‌గోలుగా త‌గిలేసిన గ‌త గులాబీ స‌ర్కార్ కానీ, తానే ఇంజ‌నీర్ న‌ని గొప్ప‌లు చెప్పిన మాజీ సీఎం కేసీఆర్ కానీ ఎవ‌రూ నోరు మెద‌ప‌డం లేదు. గోటితో పోయే దానిని గొడ్డ‌లితో న‌రికిన‌ట్టు ఉంది. ప్ర‌పంచంలోనే ఇలాంటి ప్రాజెక్టు ఎక్క‌డా లేద‌ని ఊద‌రగొట్టారు. దేశ వ్యాప్తంగా ప్ర‌చుర‌ణ‌, ప్ర‌సార మాధ్య‌మాల‌లో ప్ర‌చారం చేశారు. వీటికి కూడా తెలంగాణ ప్ర‌భుత్వ ఖ‌జానా నుంచి దోచి పెట్టారు. ఇంత జ‌రిగినా ఎవ‌రూ నోరు మెద‌ప‌డం లేదు. విచిత్రం ఏమిటంటే ఎక్క‌డైనా ప్రాజెక్టు క‌ట్టాలంటే ముందు డీపీఆర్ (ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి పూర్తి నివేదిక‌) ను స‌మ‌ర్పించాల్సి ఉంటుంది. ఇక కేంద్రంలో ఉన్న బీజేపీ స‌ర్కార్ కాళేశ్వ‌రం ఏటీఎం అంటూ ఆరోప‌ణ‌లు గుప్పించారే త‌ప్పా ఎక్క‌డా ఎవ‌రు అవినీతికి పాల్ప‌డ్డారనే విష‌యం తెలిసినా బ‌య‌ట‌కు చెప్ప‌క పోవ‌డం, చ‌ర్య‌లు చేప‌ట్ట‌క పోవ‌డం దారుణం.

ఇక నిర్మాణ సంస్థ మేఘా సంస్థ , దాని చీఫ్ కృష్ణా రెడ్డి ద‌ర్జాగా ఎంజాయ్ చేస్తున్నారు. ల‌క్ష కోట్ల అప్పును జ‌నం నెత్తిన రుద్దారు. ఈ అప్పుల భారాన్ని ఎవ‌రు మోస్తార‌నేది తేలాల్సి ఉంది. స‌హ‌క‌రించిన ఉన్న‌తాధికారులు నిమ్మ‌కుండి పోయారు. దొర వారు విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇక ఈ మొత్తం కాళేశ్వ‌రం అవినీతి నిజ‌మేనంటూ కేంద్ర స‌ర్కార్ ఆధీనంలోని కంట్రోల‌ర్ అండ్ ఆడిట‌ర్ జ‌న‌ర‌ల్ (కాగ్ ) తేట తెల్లం చేసింది. ఏకంగా ఈ ఒక్క ప్రాజెక్టులో చోటు చేసుకున్న నిర్ల‌క్ష్యం, బాధ్య‌తా రాహిత్యం, అక్ర‌మాల గుట్టును బ‌య‌ట పెట్టింది. ఒక ర‌కంగా ఈ ఒక్క రిపోర్టు ఆధారంగా ఇందులో బాధ్యులైన ప్ర‌తి ఒక్క‌రికి జీవిత ఖైదు విధించినా పాపం పోద‌న్న అభిప్రాయం వ్య‌క్తం అవుతోంది. ఇక అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే అవినీతిని క‌క్కిస్తామ‌ని , అరెస్ట్ చేస్తామ‌ని ప్ర‌గ‌ల్భాలు ప‌లికిన కాంగ్రెస్ స‌ర్కార్ మీన మేషాలు లెక్కిస్తోంది. ఇక మేఘా కంపెనీ అన్ని పార్టీల‌కు పార్టీ ఫండింగ్ ఇచ్చింద‌న్న విమ‌ర్శ‌లు ఉన్నాయి. విచార‌ణ పేరుతో కాల యాప‌న చేయ‌డం త‌ప్పితే చ‌ర్య‌లు ఉండ‌వ‌న్న అభిప్రాయం వ్య‌క్తం అవుతోంది జ‌నం నుంచి. కాగ్ రిపోర్టులో దిమ్మ తిరిగే వాస్త‌వాలు వెలుగు చూశాయి. విచిత్రం ఏమిటంటే 2018 జూన్ లో కేంద్రానికి డీపీఆర్ స‌మ‌ర్పించింది.

కానీ అంత‌కంటే ముందే కాళేశ్వరం ప్రాజెక్టు ప‌నుల‌కు సంబంధించిన ప‌నుల‌ను కాంట్రాక్ట‌ర్ కు గంప గుత్త‌గా ఆనాటి బీఆర్ఎస్ స‌ర్కార్ కేటాయించిన‌ట్లు కుండ బ‌ద్ద‌లు కొట్టింది. నీటిని ఎత్తిపోసే మోటార్లు, పంపుల కోసం రూ. 28,151 కోట్ల కాంట్రాక్ట్ ను నిర్మాణ సంస్థ‌ల‌కు అప్ప‌గించడం వెనుక అక్ర‌మాలు చోటు చేసుకున్నాయి. కేవ‌లం కాంట్రాక్ట‌ర్ల కోస‌మే ఈ ప్రాజెక్టును క‌ట్టిన‌ట్టు అనిపిస్తోంది. డీపీఆర్ లో రూ. 63,000 కోట్లు గానే పేర్కొన్నారు. కానీ ఆ అంచ‌నా వ్య‌యం భారీగా పెరిగింది. చివ‌ర‌కు ల‌క్షా 2 వేల కోట్ల‌కు చేరుకోవ‌డం విస్తు పోయేలా చేసింది. ఇప్పుడున్న ప్ర‌కారం చూస్తే కాళేశ్వ‌రం ప్రాజెక్టు ఖ‌ర్చు ల‌క్షా 50 వేల కోట్ల‌కు చేరుకునే ఛాన్స్ ఉంద‌ని హెచ్చరించింది. ఇక ప్రాజెక్టుకు సంబంధించి అప్ప‌గించిన ప‌నుల‌కు సంబంధించి వివ‌రాల‌ను, ఆధారాల‌ను నీటి పారుద‌ల శాఖ ఇవ్వ‌లేక పోయింద‌ని గుర్తించింది. ప్ర‌భుత్వ రంగ సంస్థ బీహెచ్ఈఎల్ కు రూ. 1686 కోట్లు చెల్లిస్తే కాంట్రాక్ట‌ర్ల‌కు స‌ర్కార్ రూ. 7,211 కోట్లు చెల్లించ‌డంతోనే ఎలా డ‌బ్బులు చేతులు మారాయో స్ప‌ష్టం అవుతుంద‌ని కాగ్ చీవాట్లు పెట్టింది. మొత్తంగా కాగ్ దెబ్బ‌కు గులాబీ నేత‌ల్లో ద‌డ మొద‌లైంది. ఏది ఏమైనా అడ్డ‌గోలుగా ప్ర‌జా ధనాన్ని లూఠీ చేసే హ‌క్కు ఎవ‌రు ఇచ్చార‌నేది ప్ర‌శ్నించాల్సిన బాధ్య‌త జ‌నంపై ఉంది.