కూటమికి షాక్ టీఎంసీ కటీఫ్
సంచలన ప్రకటన చేసిన సీఎం
కోల్ కతా – సార్వత్రిక ఎన్నికల వేళ ప్రతిపక్షాలతో కూడిన ఇండియా కూటమికి బిగ్ షాక్ తగిలింది. ఆ కూటమిలో కీలక పాత్ర పోషిస్తున్న టీఎంసీ చీఫ్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన ప్రకటన చేశారు. తాము కూటమితో జరిపిన చర్చలు విఫలమయ్యాయని, దీంతో ఒంటరిగానే బరిలోకి వెళతామని చెప్పారు.
ఇక నుంచి కాంగ్రెస్ పార్టీతో సంబంధాలు ఏవీ ఉండబోవన్నారు. దీంతో ఆమె లేకుండా ఎలా మోదీని ఎదుర్కోగలదనే అనుమానం కలుగుతోంది. ఇప్పటికే పలు దఫాలుగా కూటమి భేటీ అయ్యింది. పరస్పర చర్చలు జరిగాయి. కానీ సీట్ల పొత్తుపై ఇంకా చర్చలు కొలిక్కి రాలేదు.
బెంగాల్ లోని 42 లోక్ సభ స్థానాలకు టీఎంసీ స్వంతంగా పోటీ చేస్తుందన్నారు మమతా బెనర్జీ. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడారు. ఫలితాలు వచ్చాక కూటమిలో ఉండాలా లేదా అన్న దానిపై పునరాలోచిస్తామని స్పష్టం చేశారు.
తాను ఇప్పటి వరకు ఎవరితోనూ మాట్లాడ లేదన్నారు దీదీ. ఇదిలా ఉండగా ప్రస్తుతం రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర గురువారం పశ్చిమ బెంగాల్ లోకి ప్రవేశిస్తుంది. ఈ సమయంలో ఉన్నట్టుండి మమతా బెనర్జీ సంచలన ప్రకటన చేయడం కలకలం రేపింది. దీనిపై కూటమి చైర్మన్ , ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ఇంకా స్పందించాల్సి ఉంది.