కాంగ్రెస్ నియోజకవర్గ ఇంఛార్జి ఎ. తిరుపతి రెడ్డి
కోడంగల్ – రాష్ట్రంలో అన్ని రంగాలలో కోడంగల్ రోల్ మోడల్ గా ఉండేలా తీర్చి దిద్దేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని స్పష్టం చేశారు కోడంగల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ ఎ. తిరుపతి రెడ్డి. ప్రధానంగా విద్య, వైద్యం, మౌలిక రంగాల సదుపాయాల కల్పనపై దృష్టి సారిస్తున్నామని తెలిపారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే ప్రణాళికలు తయారు చేసే పనిలో ఉన్నతాధికారులు బిజీగా ఉన్నారని స్పష్టం చేశారు .
తాము కూడా రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్లమని, ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలు ఏమిటో చూసిన వాళ్లం కనుక ఏ ఒక్కరు ఇబ్బంది పడకుండా ఉండేందుకు గాను కీలక నిర్ణయాలు తమ నాయకుడు తీసుకోవడం జరిగిందని తెలిపారు.
సీఎంగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే రాష్ట్రంలో కోడంగల్ తో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర నియోజకవర్గాలను పైలట్ ప్రాజెక్టులుగా ఎంపిక చేయడం జరిగిందన్నారు. ఇదే సమయంలో గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనా కాలంలో కోడంగల్ నియోజకవర్గాన్ని పట్టించు కోలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఎ. తిరుపతి రెడ్డి.
తమ స్వస్థలం కొండారెడ్డి పల్లి అయినా కోడంగల్ ప్రజలు ఎ. రేవంత్ రెడ్డిని తమ స్వంత బిడ్డ కంటే ఎక్కువగా చూసుకున్నారని, అంతకు మించి ప్రేమను, ఆదరాభిమానాలను కురిపించారని ప్రశంసించారు. ఇదే సమయంలో భారీ మెజారిటీని కట్టబెట్టడంతో ఇవాళ అత్యున్నత పదవిని వరించేలా చేసిందన్నారు.
రాబోయే రోజులలో కోడంగల్ నియోజకవర్గం పారిశ్రామిక, విద్యా, ఆరోగ్య , వనరుల వినియోగానికి సంబంధించి హబ్ గా ఉండ బోతోందని స్పష్టం చేశారు. ఈ ప్రాంతపు ప్రజలకు మెరుగైన జీవితాన్ని, అంతకు మించి ప్రపంచంతో పోటీ పడేలా పిల్లలను విద్యా వంతులను చేయాలని సీఎం కృత నిశ్చయంతో ఉన్నారని స్పష్టం చేశారు. ఎవరికి ఎలాంటి సాయం కావలన్నా, లేదా ఇబ్బందుల్లో ఉన్నా వెంటనే స్పందిస్తూ పరిష్కరించేందుకు ప్రయత్నం చేస్తున్నామని పేర్కొన్నారు ఎ. తిరుపతి రెడ్డి.
వివిధ రంగాలకు చెందిన పరిశ్రమలు ఇక్కడికి రాబోతున్నాయని, వీటి ద్వారా వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించనుందని వెల్లడించారు. ఇటు హైదరాబాద్ అటు రాయచూర్ దగ్గరగా ఉండడంతో వ్యాపార, వాణిజ్య పరంగా మరింత కనెక్టివిటీ పెరిగే ఛాన్స్ ఉందన్నారు.
కోడంగల్ అంటేనే చిరు ధాన్యాలకు ప్రసిద్ది చెందిందని, ఇక తాండూరు బండలకు ప్రాముఖ్యత వహించిందని తెలిపారు. అంతే కాకుండా మహిళా స్వయం సహాయక సంఘాలు బలంగా ఉన్నాయని, వారికి చేయూతను ఇవ్వడం ద్వారా మరింత బాగు పడేందుకు వీలు కలుగుతుందన్నారు ఎ. తిరుపతి రెడ్డి.
రాబోయే రోజుల్లో కోడంగల్ ముఖ చిత్రం సమూలంగా మార బోతోందని, ఆరు నూరైనా , ఎన్ని కష్టాలు ఎదురైనా సరే ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారని, అభివృద్ది చేసి చూపిస్తారని ప్రకటించారు.
అయితే రాజకీయాలలో విమర్శలు సహజమని, వాటిని తాము పట్టించుకోమని..కేవలం అభివృద్ది పైనే ఫోకస్ పెడతామని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా కోడంగల్ ప్రాంతం అభివృద్దికి విలువైన సూచనలు, సలహాలు ఇవ్వాలని ఎ. తిరుపతి రెడ్డి కోరారు.